గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలకు ఏ క్షణంలోనైనా వరదలు..
శ్రీశైలం వైపు వెళ్లకండి, ఐఎండీ హెచ్చరిక, చంద్రబాబు ఏరియల్ సర్వే, 4.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుపాను ప్రభావంతో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. మంత్రులు జిల్లాలలో పర్యటనలు చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ స్తంభించింది. 4.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 8 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు రావచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది.
ఏపీలో ఎక్కడెక్కడ వరదలు రావచ్చు...
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలకు వరదల ముప్పు పొంచి ఉంది.
ఇక, మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు రావచ్చు.
38 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1.38 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు (ఉద్యాన పంటలు) దెబ్బతిన్నట్టు ప్రాధమిక అంచనా. ఇప్పటికి ఇద్దరు చనిపోయారు. 20మందికి పైగా గాయపడ్డారు.
‘మొంథా’ తుపాన్ తీరం దాటిన తర్వాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత వర్షాలు కురుస్తున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి రహదారిపై పడ్డాయి. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పడిన రాళ్లను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు.
చంద్రబాబు ఏరియల్ సర్వే..
మొంథా తుపాను పెనువిపత్తని.. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, తుపాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.
గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం’’ అని సీఎం తెలిపారు.
మొంథా తుపాను ప్రభావంతో ఈదురు గాలులకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామన్నారు. బలమైన ఈదురు గాలులకు పెద్ద ఎత్తున విద్యుత్ స్థంభాలు పడిపోయన్నారు. 20వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వర్షాలు పడుతుండటం వల్ల పునరుద్దరణకు కొంత ఆలస్యమైందని.. మధ్యాహ్నానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.