పెళ్లి పేరుతో మోసం.. నిందితుడికి జీవితఖైదు

రైల్వే కోడూరులో ఘటనపై కడప జడ్జి తీర్పు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-29 11:38 GMT

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. మోసపోయానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల పాటు ఈ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడికి కడప ఏడో అదనపు జిల్లా జడ్జి జీఎస్. రమేశ్ బుధవారం యావజ్జీవ జీవితఖైదు తోపాటు 1.60 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారు. పోలీసుల కథనం మేరకు వివరాలివి.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గొంతు సుబ్రమణ్యం (50) పెళ్లి చేసుకుంటానని ఓ యువతి (20)తో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో బాధిత యువతి 2022 మార్చి 22వ తేదీ రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు రైల్వే కోడూరు ఎస్ఐగా ఉన్న ఈవిఎల్. నరసింహం, సీఐ ఎస్. విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. వారి తరువాత ఈ కేసును ఎస్ఐ వి.లక్ష్మి ప్రసాదరెడ్డి, సీఐ కే. హేమసుందరరావు కేసు పురోగతిని పర్యవేక్షించారు.

కడప జిల్లా ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ చేశారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. యాస్మిన్ బేగం వాదనలు వినిపించారు. యువతిని మోసం చేశాడని నిర్ధారణ కావడంతో నిందితుడు గొంతు సుబ్రమణ్యంకు జీవిత ఖైదుతో పాటు రూ.1.60 లక్షల జరిమానా కూడా విధిస్తూ, జడ్జి జీఎస్. రమేశ్ శిక్ష ఖరారు చేశారు. ఈ కేసును ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే పర్యవేక్షించారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈ కేసులో నిందితుడికి విధించిన శిక్షపై స్పందించారు.
"మహిళలను వేధించినా, మోసం చేయడంతో పాటు దాడులు వంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష తప్పదు" అని హెచ్చరించారు. నమోదు చేసే కేసుల్లో బాధితులకు న్యాయం చేయడానికి 'గుడ్ ట్రయల్ మానిటరింగ్' చేస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం చేయడంలో కృషి చేసిన అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు.


Tags:    

Similar News