మొంథా తుఫాన్‌.. సమ్‌థింగ్‌ స్పెషల్‌!

తుఫాన్‌ మొంథా ఇతర తుఫాన్లకంటే భిన్నంగా ప్రభావం చూపించింది. అందుకే అది సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకుంటోంది.

Update: 2025-10-29 13:11 GMT
మొంథా తుఫాన్‌కు గుంటూరు జిల్లాలో కురిసిన వర్షం

తుఫాన్లలోకెల్లా మొంథా తుఫాన్‌ వేరయా? అన్నట్టుగా ఉంది దాని తీరు. వారం రోజుల క్రితమే ఈ తుఫాన్‌ గురించి, దాని గమనం, తీవ్రత గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ)తో పాటు ఇతర వెదర్‌ ఏజెన్సీలు అంచనా వేశాయి. దక్షిణ అండమాన్‌ సముద్రంలో పురుడు పోసుకున్న ఉపరితల ఆవర్తనం క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. అనంతరం నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చాక వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను బలపడింది. ఆపై తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చింది. ఈ మొంథా తుఫాన్‌ మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుందని ఐఎండీ, ఇతర వాతావరణ సంస్థలు ముందస్తు అంచనాలు వేశాయి. కానీ ఈ తుఫాన్‌ నర్సాపురానికి సమీపంలో మంగళవారం అర్థరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చేరువలో ల్యాండ్‌ ఫాల్‌ అయింది.


మొంథా ప్రభావానికి పొంగిపొర్లుతున్న వాగు

తీరం దాటే చోట సాధారణ వర్షమే..
సాధారణంగా తుఫాన్‌ తీరాన్ని దాటే ప్రాంతంలో విధ్వంసకర పరిస్థితులుంటాయి. తుఫాన్‌ తీరాన్ని తాకి పూర్తిగా భూమిపైకి రావడానికి కనీసం 3–4 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెనుగాలులతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తుంటాయి. చెట్లను, విద్యుత్‌ స్తంభాలను, పురాతన కట్టడాలు, ఇళ్లను, పూరిగుడిసెలను, కచ్ఛా ఇళ్లను కూల్చివేస్తుంటాయి. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. దాదాపు 60–70 కిలోమీటర్ల పరిధిలో తుపాను బీభత్సం సృష్టిస్తుంది.
కానీ మొంథా తుఫాన్‌ ఏం చేసింది?
కానీ మొంథా తుఫాన్‌ ఏం చేసిందంటే? మునుపటి తుఫాన్లకు భిన్నంగా వ్యవహరించింది. ఐఎండీ అంచనాలకు ఒకింత దూరంగా తీరాన్ని దాటింది. పైగా అది తీరాన్ని దాటే సమయంలో పరిసరాల్లో గంటకు 90–110 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని, 15–20 సెం.మీల భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎంyీ పేర్కొంది. కానీ మంగళవారం రాత్రి తుఫాన్‌ తీరాన్ని దాటే ప్రాంతంలో అంతటి ఉధృతమైన గాలులు వీయలేదు. కుంభవృష్టి వర్షమూ కురవలేదు. గాలుల వేగం 70–80 కి.మీలకు, వర్షపాతం 2–3 సెం.మీలకు మించలేదు. అయితే విచిత్రమేమిటంటే? తుఫాన్‌ తారాన్ని దాటిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరంలో మాత్రం కుండపోత వర్షం కురిసింది. పెనుగాలులు వీచాయి. భారీ ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే తుఫాన్‌ తీరాన్ని దాటే ప్రాంతంలో సృష్టించాల్సిన బీభత్సం రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కనిపించింది. నర్సాపురానికి 370 కి.మీలో ఉన్న కావలి (నెల్లూరు)లో 23, 250 కి.మీల దూరంలోని సింగరాయకొండ (ప్రకాశం), 475 కి.మీలోని వరికుంట్ల (కడప), 170 కి.మీలలోని పరచూరు (బాపట్లలో) 21, 300 కి.మీల దూరంలోని ఎస్‌కోట (విజయనగరం)లో 11 సెం.మీల చొప్పున భారీ వర్షం కురిసింది. కానీ నర్సాపురంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా 2.3 సెం.మీలకు మించి వర్షపాతం నమోదు కాలేదు.

భానుకుమార్‌ 

ఎందుకిలా జరిగింది?
సైక్లోన్‌ మొంథా తీరాన్ని దాటే సమయంలో ఆ ప్రాంతంలో ఏమంత ప్రభావం చూపకపోవడానికి కారణం.. సైక్లోన్‌ ‘ఐ’లో విండ్‌ షీర్‌ (గాలుల కోత) ఏర్పడడమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వీరు చెబుతున్న దాని ప్రకారం తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు విండ్‌ షీర్‌ ఏర్పడడంతో తుపాను గాలులు విచ్ఛిన్నమయ్యాయి. దీంతో మొంథా తీరాన్ని దాటకముందే బలహీనపడి తుపాను ప్రధాన కేంద్రం నుంచి వందల కిలోమీటర్ల మేర మేఘాలు, గాలుల చెల్లా చెదురయ్యాయి. ఫలితంగా తుపాను తీరాన్ని దాటిన ప్రదేశంలో కాకుండా సుదూర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడానికి దోహదపడింది. ‘మొంథా తుఫాన్‌ ఏర్పడినప్పట్నుంచి వేగంగా అంటే గంటకు గరిష్టంగా 18 కి.మీల వేగంతో కదిలింది. అంతేకాదు.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా తుఫాన్‌ బలహీనపడింది. అదే నెమ్మదిగా పయనిస్తే అతి తీవ్ర తుఫాన్‌గా బలపడేది. తీరాన్ని దాటే సమయంలో విండ్‌ షీర్‌ ప్రభావం కూడా తీవ్రత తగ్గడానికి దోహదపడింది’ అని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి చెప్పారు.
Tags:    

Similar News