249 మండలాలు, 48 మున్సిపాలిటీలపై తుపాను పంజా
4.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం, ఇద్దరు మృతి, కృష్ణా జిల్లాలో స్కూళ్లకు రేపు సెలవు లేదు..
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు అధికారులు. మొంథా తుపాను ప్రభావంతో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. తుపాను నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రికి రెండు రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. శాఖల వారీగా నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ తన ప్రాధమిక నష్టం అంచనా వేసింది. అన్ని శాఖల నుంచి ప్రాథమిక అంచనాలు వచ్చాకే కేంద్రానికి నివేదించనుంది ఏపీ ప్రభుత్వం.
249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం ఉందని అధికారులు గుర్తించారు. మొంథా తుఫానుతో ఏపీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని అధికారులు తెలిపారు.
మంత్రులు జిల్లాలలో పర్యటనలు చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ స్తంభించింది. 4.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 8 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. 10 వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయని అధికారులు తెలిపారు.
ఈదురు గాలుల వల్ల కోనసీమ జిల్లావ్యాప్తంగా 300 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాటి పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 134 కిలోమీటర్ల మేర రహదారులపై నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.
ఆర్టీసీ బస్సుల రాకపోకలు యథావిధిగా సాగించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా వ్యాప్తంగా 400 పునరావాస కేంద్రాలు నిర్వహించి 10,150 మందికి ఆశ్రయం కల్పించారు. వీరిలో కుటుంబానికి రూ.3 వేల చొప్పున, ఒంటరి సభ్యులకు రూ.1000 చొప్పున పరిహారం పంపిణీ చేశారు.
గత ఐదు రోజులుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు, చేనేత కార్మికులకు కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా.
తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు రావచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది.
కౌలు రైతులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
మొంథా తుపాను ప్రభావంతో ఈదురు గాలులకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామన్నారు. బలమైన ఈదురు గాలులకు పెద్ద ఎత్తున విద్యుత్ స్థంభాలు పడిపోయన్నారు. 20వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వర్షాలు పడుతుండటం వల్ల పునరుద్దరణకు కొంత ఆలస్యమైందని, రేపటి లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.