భవిష్యత్తులో జరిగే సంఘటనలను 400 వందల సంవత్సరాల కిందటే కాలజ్ఞాని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తాళపత్రాలపై నిక్షిప్తం చేశారు. ఆయన ఇల్లు ఇప్పటికీ పదిలంగా ఉంది. తన నివాసం ఎలా ఉండబోతుందనేది కాలజ్ఞానంలో ప్రస్తావించారో? లేదో? తెలియదు కానీ, నిర్వహణ లోపం వల్ల మొంథా తుపాను కారణంగా కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవించిన ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న కందిమల్లాయపల్లె వీధి ప్రజలు కలత చెందుతున్నారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బి.మఠం) మఠానికి వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కవగా ఉంటుంది. ఇక్కడే సత్రాలతో పాటు టీటీడీ యాత్రికుల వసతి సముదాయం కూడా ఉంది. ఇక్కడికి రాయలసీమ నుంచే కాకుండా ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
బ్రంహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం శ్రీవీరభోగ వసంతరాయలు కుటుంబంలో రగిలిన వివాదం బ్రహ్మంగారి జీవించిన ఇంటి నిర్వహణను మరిచారు. దీంతో వందల సంవత్సరాల నాటి చరిత్రకు ఆనవాలుగా ఉన్న బ్రహ్మంగారి ఇల్లు తుపాను కారణంగా వారం నుంచి కురుస్తున్న వర్షాలకు పాక్షికంగా దెబ్బతినింది.
ఈ సంఘటనపై మైదుకూరుకు చెందిన ప్రసాద్ మాట్లాడుతూ,
"ఆ ప్రదేశాన్ని నేను స్వయంగా చూశా. చాలా బాధ వేసింది. బెంగళూరు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు బ్రహ్మంగారి నివాసం పునర్ నిర్మాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది" అని ప్రసాద్ చెప్పారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బి.మఠం మండల కేంద్రంగా ఉంది. వీరబ్రహ్మోంద్రస్వామి జీవితకాలంలో దీనిపేరు కందిమల్లాయపల్లె. వందల సంవత్సరాల కిందటే భవిష్య త్తును తాళపత్ర గ్రంధాలపై నిక్షిప్తం చేసిన ఆయన 16వ శతాబ్దానికి చెందిన కాలజ్ఞాని. ఆ రోజుల్లోనే ఆయన తన దివ్యజ్ఞానంతో తాళపత్రాపై రాసిన కాలజ్ఞానం ఇప్పటికీ పదిలంగా ఉంది. ప్రస్తుతం జరిగే అనేక సంఘటనలు కాలజ్ఞానాన్ని చదివిన వ్యక్తులు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అనే విషయాలను గుర్తు చేస్తుంటారు.
ఇదీ ఒకటి..
"తిరుమలలో కొన్ని రోజులు ఆలయం మూసివేస్తారు. పశుపక్షాదులు మినహా జనసంచారం ఉండదు. పూజలు కూడా కష్టమవుతాయి" అని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆ రోజుల్లోనే భవిష్యత్తును ఆవిష్కరించారు.
"పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన కాలజ్ఞానంలో తిరుమల ఆలయం మూసి వేస్తారు" అనే ప్రస్తావన ఉందనే విషయాన్ని ఆనాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పష్టం చేసిన విషయం గమనార్హం.
తిరుమల రికార్డుల ప్రకారం 1892లో రెండు రోజులపాటు ఆలయం మూసివేశారు. దీనికి కారణం మహంతులు, అర్చకులు మధ్య విభేదాల కారణంగా అప్పట్లో ఆలయం మూసివేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కరోనా సమయంలో కంకర్యాలు నిర్వహిస్తూనే యాత్రికులను అనుమతించకుండా ఆంక్షలు విధించింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
సమాజంలో జరగబోయే అనేక సంఘటనలను వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే గ్రహించి తాళ్లపత్ర ఆకులపై నిక్షిప్తం చేశారు. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఒకటి బ్రహ్మంగారిమఠం. మరొకటి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం నగిరిపాడు వద్ద ఉన్న రంగనాయకుల స్వామి ఆలయంలో ఉంది. మరో తాళపత్ర గ్రంథం బనగానపల్లెలో ఉంది.
16వ శతాబ్దంలోనే కాలజ్ఞానం..
కాలజ్ఢానాన్ని బోధించిన యోగి, తత్వ బోధ చేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 16వ శతాబ్దానికి చెందిన జ్ఞానిగా చరిత్రలో పేరు ఉంది. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం గా మారిన కందిమల్లయ్య పల్లె మండల కేంద్రం కూడా. ఇదే స్థలంలోనే ఆయన 1693లో సజీవ సమాధి అయ్యారు. ఇక్కడ స్వతహాగా విశ్వ బ్రాహ్మణుడైన పోతులూరి బ్రహ్మంగారు చెక్క పనులు చేస్తూ జీవించడం, పశువులను అడవికి తోలుకుని వెళ్లి, గుహలో ధ్యానం చేయడం, అక్కడే కాలజ్ఞానం రాసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి.
మఠం ఎదురు వీధిలోనే ఇల్లు..
సజీవసమాధి అయిన మఠానికి ఎదురుగానే ఉన్న బి.మఠం (కందిమల్లాయపల్లె) వీధిలో బ్రహ్మంగారు స్వయంగా ఇంటి నిర్మాణం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. నల్ల రాతి బండలు, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో మిద్దె లాంటి ఇంటిని అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళా భక్తురాలు పునర్ నిర్మాణం చేశారు.
" ప్రహరీగోడ నిర్మాణం, పటిష్టమైన గోడలతో ఇంటి నిర్మాణం కూడా యాత్రికులే చేశారు" అని మఠం ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇల్లు నిర్మాణానికి ద్వారం, తలుపులు స్వయంగా బ్రహ్మంగారే నగిషీలతో బొమ్మలు చెక్కారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇంటి ఆవరణలోనే లోతైన బావి కూడా తవ్వినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి" అని మఠం ప్రతినిధి వివరించారు.
"ఈ వీధిలో జన్మించడం, ఇక్కడే నివసించడం అనేది మాకు లభించిన పూర్వజన్మ సుకృతం. అని బి.మఠంకు చెందిన రమణయ్య వ్యాఖ్యానించారు.
బ్రహ్మంగారు నివసించిన ఇంటికి సమీపంలో జీవనం సాగిస్తున్న వారు కూడా యాత్రికులకు కథలు వివరిస్తూ ఉంటారు.
బ్రహ్మంగారు నివసించిన ఇల్లు 600 సంవత్సరాల కిందటిది కావడం వల్ల ఆ ప్రదేశంలో రెండుసార్లు దాతలే తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు వివరించారు.
అనుమతి రద్దు
బ్రహ్మంగారు జీవించిన ఇంటి లోపలికి కొన్నేళ్ళ కిందటి వరకు యాత్రికులను అనుమతించేవారు. ఇటీవల ఆ ఇంటి ద్వారం తలుపులు మూసి వేశారు. ఇంటి ఆవరణలోకి మినహా లోపలికి వెళ్లడానికి అనుమతించడం లేదు. మాత్రం గదిలో ఒక పక్క వంటి చేసుకునే పోయ్యి, తెలుపులు తెరవగానే దర్శనం ఇచ్చే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఫోటొలకు పూజ చేసి ఉండడం కనిపిస్తుంది. మరో గదిలో భారీగా పెరిగిన పుట్ట దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెక్కిన తలుపులు, ద్వారాలపై ఉన్న కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఆవరణలోని బావి వద్ద నీటిని బకెటుతో సేందడం ద్వారా తీర్ధంగా తీసుకోవడానికి యాత్రికులు ఆసక్తి చూపిస్తున్నారు.