అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ.. ఎంపీ మిథున్ ఆసక్తికర వ్యాఖ్య
పుంగనూరు శాంతించింది. ఎంపీ మిథున్ పర్యటన సాఫీగా సాగింది. అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-09-16 11:29 GMT
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ కూటమి నేతలు నిరసనల విరమణ పాటిస్తున్నట్లు శాంతించడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. ఆయన పుంగనూరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, అవసరమైతే పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టీడీపీ కూటమిని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాజంపేట ఎంపీ మిథున్ తో పాటు ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడానికి విఫలయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించారనే ఆగ్రహంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారానికి ముందు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకున్న టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు కదిరి మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద రాళ్ల దాడితో పాటు, పుంగనూరు పట్టణంలోకి రాకుండా అడ్డుకోవాలనే వైసీపీ శ్రేణుల ఆగడాలతో పరిస్థితి అదుపు తప్పడం, పోలీస్ వాహనం ధ్వంసంతో పాటు పరస్పరం రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపధ్యంలో..
తాజా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని 14 శాసనసభా స్థానాల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా,
2024 జూన్ 15
గత పరిణామాలపై ఆగ్రహంతో రగిలిపోతున్న టీడీపీ శ్రేణులు ఎన్నికల ఫలితాల తరుతాత ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని నియోజికవర్గంలోకి రానివ్వమంటూ కార్యకర్తలే స్వచ్ఛందంగా రోడ్లపైకి చేరారు. దీంతో పోలీసుల సూచనలతో పెద్దిరెడ్డి తన పర్యటన విరమించుకున్నారు. ఆ తరువాత కూడా తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాలనే పెద్దిరెడ్డి ప్రయత్నం కూడా బెడిసిపొట్టింది.
2024 జూలై 24
నెల క్రితం తమ కుటుంబానికి సన్నిహితుడు అయిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్పను పరామర్శించడానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆవులపల్లె రిజర్వాయర్ తో భూములు కోల్పోయి, నిర్వాసితులైన రైతులు పరిహారం విషయం మాట్లాడేందుకు వెళ్లడం, అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా రంగ ప్రవేశం చేయడంతో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్దకు ఎంపీ మిథున్ తో కలిసి తిరుపతి నుంచి వెళ్లిన కొందరు రాళ్లు, కుర్చీలతో దాడులకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది. రంగప్రవేశం చేసిన పోలీసులు తమ వాహనంలో అతికష్టంపై ఎంపీ మిథున్ ను తమ వాహానంలో తిరుపతికి తరలించారు. ఈ ఘటనలపై రెండు పక్షాలపై మూడు కేసులు కూడా నమోదయ్యాయి.
తీవ్ర ప్రతిఘటనల నేపథ్యంలో సొంత ఊరు, పుంగనూరు నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాదం మోపడం కష్టంగా మారింది. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈయన మొదటిసారి ప్రతిఘటన ఎదుర్కొన్నారు అనడంలో సందేహం లేదు.
పాదం మోపిన మిథున్
ఎలాగైనా తమ సెగ్మెంట్లలో పర్యటించాలనే పంతాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం నెగ్గించుకున్నారు. ఇటీవల మరణించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి మిథున్ రాక నేపథ్యంలో నియోజకవర్గం నుంచే కాకుండా, సమీపంలోని మదనపల్లె, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాల నుంచి ప్రధాన మద్దతుదారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పుంగనూరుకు చేరుకున్నారు. ీ సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై ఆంక్షలు విధించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా కౌన్సిలర్లను మినహా ఎవరినీ అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. పట్టణంలో పోలీసులు సంసద్ధంగా మోహరించి, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా...
"పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దిరెడ్డి కుటుంబ ప్రతినిధిగా కట్టుబడి ఉన్నా" అని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ కార్యాలయంలో మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, పుంగనూరు అంజుమన్ కమిటీ సభ్యులు, ఇటీవల టీడీపీలోకి వెళ్లి తిరిగి వచ్చిన మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు, తొమ్మది మంది కౌన్సిలర్లు, కీలక నేతలతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
"అవసరమైతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనగణన తరువాత "పుంగనూరును రెండు నియోజవర్గాలుగా విభజిస్తే మాత్రం తాను ఎంఎల్ఏగా పోటీలో ఉంటా" అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తెరతీశాయి. పుంగనూరులో అంజుమన్ కమిటీ హాల్ నిర్మాణానికి రూ. కోటి మంజూరుకు హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ విషయంలో వైసీపీ మైనారిటీల ప్రయోజనాలు, హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉందని అన్నారు.
ఇరకాటంలో పెట్టే సవాల్
రాజకీయాలకు అభివృద్ధికి ముడిపెట్టవద్దని ఎంపీ మిథున్ కోరారు. కొన్ని విషయాలను ప్రస్తావించిన ఆయన టీడీపీ కూటమిని ఇరకాటంలో పెట్టారు. అందులో "పుంగనూరులో టొయోటా కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది" అని ఎంపీ మిథున్ గుర్తు చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నారు. ఎకరా రూ. పది నుంచి 11 లక్షలు ఉన్న చోట రూ. 20 లక్షలు పరిహారం ఇస్తున్నారు ఆ పరిశ్రమ స్థాపనతో పాటు తమ వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గానికి వాటర్ గ్రిడ్ పథకం మంజూరు చేసింది. అందులో 50 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది" అని గుర్తు చేశారు. టెండర్లు కూడా పూర్తయిన ఈ కార్యక్రమం పూర్తి చేయించడానికి, "బస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా పరిశ్రమ యజమానులు సిద్ధంగా ఉన్నారు" ఈ పనులు పూర్తి చేయించడానికి శ్రద్ధ తీసుకోవడం ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకోండి. ఆ ఖ్యాతి కూడా మీ ఖాతాలో వేసుకోండి. ఇదే ప్రదేశంలో మళ్లీ ప్రెస్మీట్ పెట్టి మిమ్మలను పేరుపేరునా పొడుగుతా" అని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సవాల్ చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే...
ఇంత ప్రశాంతతకు కారణం..?
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతి నుంచి ఆ కూటమి నేతలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని పుంగనూరు నియోజకవర్గంలోకి పాదం మోపనివ్వడానికి ససేమిరా అన్నారు. తాజాగా సోమవారం మాత్రం అందుకు విభిన్నమైన శాంతియుత వాతావరణం రాజ్యమేలింది. ఎక్కడా ప్రతిఘటన లేదు. నిరసనలు లేవు. కారణం ఏమిటనేది ఆరా తీస్తే...
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులను అడ్డుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో రాజకీయ కక్షకు పాల్పడుతున్నారనే నిందలు వస్తున్నాయనే విషయం పార్టీ పెద్దలు గ్రహించినట్లు తెలుస్తున్నది. దీనివల్ల ప్రయోజనం లేకపోగా, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదనే విషయంపై సీనియర్లు సీఎం ఎన్. చంద్రాబాబుకు నివేదించారని సమాచారం. దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. ఇదే విషయమై పుంగనూరులో ఓటమి చెందిన టీడీపీ అభ్యర్థి చల్లా బాబు నుంచి నుంచి కూడా పార్టీ క్యాడర్ కు ఫోన్ కాల్స్ వెళ్లాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజంపేట ఎంపీ మిథున్ పర్యటన సవ్యంగా సాగడానికి మార్గం సుగుమం అయినట్లు కనిపిస్తోంది. ఒకవిధంగా ఇది మంచి వాతావరణమే. కానీ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన జరిగితే కానీ, పుంగనూరులో వాస్తవ పరిస్థితి వెల్లడయ్యే అవకాశం ఉండదు. ఏమి జరుగుతుందనేది వేచిచూడాలి.