కాడి మోసే కాంగ్రెస్ నేతలకు కొరడా దెబ్బలు తప్పవా..?!

కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తలకెత్తుకునే నేతలు జల్లెడ పట్టినా దొరకడం కష్టం. ఆ బాధ్యతను నిర్వహించే నాయకులకు మాత్రం రాళ్ల దెబ్బలు తప్పవు.

Update: 2024-05-26 16:08 GMT

కాంగ్రెస్ పార్టీలో అందరూ పెద్దలే. అధికారంలోకి వస్తే పదవుల కోసం పోరాటం అంతా.. ఇంత ఉండదు. కష్టకాలంలో బాధ్యతలు తీసుకునే వారు కొందరే ఉంటారు. అధికారంలో ఉన్న, లేకున్నా, పార్టీ సారథ్య బాధ్యతల్లో రాయలసీమ ప్రాంత నేతలు ముందుంటారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది.

అంతేకాదు... కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ప్రతిపక్షం అవసరం లేదు. ఆ పార్టీలోనే అసమ్మతి, తిరుగుబాటు వర్గం ఎప్పుడు ఉంటుంది. తమకు పదవులు లేకున్నా పరవాలేదు. కానీ ఎదుటివాడు ఎదగకూడదు. అనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో వీడని స్నేహంలో వెంట ఉంటుంది.

రాయలసీమ ప్రాంతం నుంచి సీఎంగా ఎంపికైన దామోదరం సంజీవయ్య మొదలుకొని ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్ష సారథ్య బాధ్యతలు చేపట్టిన వైఎస్. షర్మిల వరకు అందరూ బాధితులే. నిజం నిత్యం అసమ్మతి పోటు పక్కలో పల్లెంలా ఉంటుంది. ఆ కోవలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులే కాదు. సీఎంలు కూడా పల్లకిందులై పదవీచితులు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

నాయకుల చరిష్మా ఎంత..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత విభజిత రాష్ట్రంలో పిసిసి, సీఎంలుగా వ్యవహరించిన వారి చరిష్మా ఏ స్థాయిలో పనిచేసిందని పరిశీలిస్తే, ఆ సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒంటి చేత్తో పార్టీ సారథ్య బాధ్యతలు నెరిపిన వారిలో డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డిని మించిన వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కొన్ని నియోజకవర్గాలు జిల్లా స్థాయిలో కొంతమందికి మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా అనుచరులు, చరిష్మా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఆ కోవలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు, డి. శ్రీనివాస్, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, బొత్స సత్యనారాయణ ఏం కొందరు నేతలు ఉంటారని చెప్పవచ్చు. కానీ ఆయనకు ప్రాంతాలవారీగా అసమ్మతి నేతలు పక్కలో బల్లెం మాదిరి నిలిచారు అనే సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

వ్యక్తి కోసం పార్టీని ముంచారు...

1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉంది. ఆ సమయంలో డాక్టర్ వైఎస్ఆర్.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఆర్కే ధావన్ బాధ్యతల్లో ఉన్నారు. ఇద్దరూ మహా జోరుగా రాష్ట్రమంతా కలియ తిరుగుతున్నారు. పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా కదం తొక్కుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ప్రచారం ముగిసింది. ఆర్కే ధావన్‌తో కలిసి డాక్టర్ వైయస్సార్ కోస్తా ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. విజయవాడలో జరిగిన సభలో ఆర్కే ధావన్ చెప్పిన ఒకే ఒక మాట " అవర్ సీఎం క్యాండిడేట్ ఇస్ డాక్టర్ వైఎస్ ( ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి)’’ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచింది. ఈ ప్రకటన వినగానే, వైయస్‌ను వ్యతిరేకించే సీమలోని కొందరు, పల్నాడులో ఒకరు, కోస్తాలో ఇంకొందరు ఏకమై పరోక్షంగా టిడిపికి అందించిన సహకారం వల్ల అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి కల్పించారు. అనేది అప్పటి రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత చరిత్రలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధిత నిర్వహించిన వారి పనితీరును పరిశీలిస్తే...

పిసిసి నేతల పాత్ర

1955 నుంచి 2024 వరకు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పిసిసి అధ్యక్షులుగా, సీఎంలుగా 25 మంది పనిచేశారు. ప్రస్తుతం వైఎస్. షర్మిల రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. వారిలో పదిమంది రాయలసీమ, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులే ఉన్నారు. మిగతా 15 మంది తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తా నేతలే పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కాలంలో ఐదు సార్లు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏపీసీసీ అధ్యక్షుల సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఒకసారి మాత్రం కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానంద రెడ్డి పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. సీఎం బాధ్యతలు నిర్వహించిన వారిలో కూడా ఉన్నారు.

అధ్యక్ష బాధ్యతలకు పొగే..

1951 నుంచి 1955 వరకు అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన సీఎం కావడంతో 1955 నుంచి 1956 వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన బెజవాడ గోపాలరెడ్డి పిసిసి సారథ్య బాధ్యతలు స్వీకరించారు. ఆ కాలంలో వారిద్దరూ సీఎంగా కూడా పాలన సాగించారు. 1956 నుంచి 1961 వరకు కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య పిసిసి బాధ్యతలు సాగించారు. 1980 నుంచి 81 వరకు కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1983 నుంచి 1985 వరకు కడప జిల్లా పులివెందుల చెందిన వైఎస్. రాజశేఖర్ రెడ్డి, 1988 నుంచి 1989 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మళ్లీ జనార్దన్ రెడ్డి, 1998 నుంచి 1999 వరకు డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి పిసిసి సారథ్య బాధ్యతలు నిర్వహించిన వారిలో ఉన్నారు.

దండులా కదిలి ఉప్పెనల పెరిగి..

ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సిఎల్పీ లీడర్‌గా ఉన్న డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి 2003లో చేపట్టిన పాదయాత్ర ప్రభంజనంలో మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అవిశ్రాంతంగా పాదయాత్ర సాగించిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో కూడా నేను సీఎం అభ్యర్థి రేసులో ఉన్నాను అంటూ ఎం. సత్యనారాయణ రావు, మరొకరు తెరమీదికి రావడం, ఏఐసీసీ పెద్దల జోక్యంతో వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు చొరవ తీసుకున్నారు. డాక్టర్ వైయస్సార్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిమానాన్ని చూరగొని,

2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వరుసగా రెండోసారి వైఎస్. రాజశేఖరరెడ్డి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచారన్నట్లుగా.. హెలికాప్టర్ ప్రమాదంలో డాక్టర్ వైయస్సార్ మరణించిన తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం కూడా విడిపోయింది. ఆ తర్వాత..

సీమ నేతలే..

దివంగత సీఎం డాక్టర్ వైయస్ఆర్‌కు అత్యంత సన్నిహిత విధేయులైన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రుల్లో బీసీ సామాజిక వర్గం మడకశిర నియోజకవర్గానికి చెందిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి, సింగనమల నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడు సాకే శైలజానాథ్ పిసిసి అధ్యక్షత బాధితులు నిర్వహించారు. వీరిద్దరూ వైయస్సార్, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమారరెడ్డి సీఎంల సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 నుంచి 2020 వరకు ఎన్. రఘువీరారెడ్డి, 2020 నుంచి 2022 వరకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిసిసి సారథ్య బాధ్యతలు అతికష్టంగా నిర్వహించారు.

వైయస్సార్ తరహాలో .. తెరపైకి షర్మిల

మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు నుంచి దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ కుమార్తె వైఎస్. షర్మిలా రెడ్డి 2024 జనవరి 16వ తేదీ పిసిసి సారథ్య బాధ్యతలను మోస్తున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెనర్‌గా మారారు.

రాష్ట్ర విభజన తర్వాత అంపసయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదిన వైఎస్. షర్మిలారెడ్డి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. పాత తరం నాయకులను కలుపుకొని, కాంగ్రెస్ అభిమానులందరినీ కూడగట్టారు. కోస్తా ప్రాంతం నుంచి సభలను ప్రారంభించిన ఆమె రాయలసీమలోని అనంతపురం వరకు నిర్వహించిన మొదటి సభలన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభిమానులు నూతనోత్తేజం పొందారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సజావుగా పనిచేసిన నాయకులు, ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. మొదటి నుంచి డాక్టర్ వైయస్సార్‌కు వ్యతిరేకంగా.. వీ. హనుమంతరావు కోటరీలో మాజీ ఎంపీ జీవీ. హర్షకుమార్ మెలుగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టిడిపిలో చేరి, బహిరంగ సభలో చంద్రబాబు కాళ్ళు కూడా మొక్కారు. అక్కడ టికెట్ దగ్గర స్థితిలో మళ్లీ కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇటీవల ఆయన నివాసానికి వచ్చిన వి. హనుమంతరావు మాట్లాడుతూ.. వైఎస్. షర్మిలపై ప్రస్తావన చేశారు.

" నేను ఎప్పుడో చెప్పా. తల్లి తెలంగాణలో కాదు కొట్టడాల్సింది. ఆంధ్రాలో మీ అన్న వైయస్ జగన్ పై పోరాడు" అని వ్యాఖ్యానించారు. రోజుల వ్యవధిలోనే.. సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితుడు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ పోలింగ్ ముగిసిన తర్వాత తీవ్రస్థాయిలో వైఎస్. షర్మిల రెడ్డి పై విరుచుకుపడ్డారు. " ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు. ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ" అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరాల నేపథ్యంలో సీనియర్ నాయకుల వ్యవహార సరళి కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వీరందరికీ రాష్ట్రస్థాయిలో పార్టీని ఏకం చేసే సత్తా ఉందా? వారి తరహాలో ఇంకా ఎంతమంది బయటికి వస్తారు? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందో? ఆగుతుందా? పార్టీ అధ్యక్షురాలిపై వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్న నేతలను ఏఐసీసీ ఎలా నియంత్రిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి వేరుగా ప్రతిపక్షం అవసరం లేదు అనే మాటను చెప్పగానే చెబుతున్నారు. అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News