కడప జిల్లాలో 'అన్నదాత సుఖీభవ'కు బట్ నొక్కనున్న సీఎం..
46.86 లక్షల మంది రైతులకు రూ. 3,135 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-19 04:06 GMT
కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేయనున్నారు. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు గ్రామంలో బుధవారం (19వ తేదీ) ఆయన పర్యటించనున్నారు. పీఎం కిసాన్ అన్నదాతా సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని రైతుల ఖాతాలకు నగదు విడుదల చేయడానికి బటన్ నొక్కనున్నారు.
కార్యక్రమాలు ఇలా..
ముఖ్యమంత్రి కార్యక్రమాలు సిద్ధం చేశామని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆ వివరాలు తెలిపారు. ఆ మేరకు ఎల్లటూరు గ్రామంలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి మంగళవారం సాయంత్రం చేరుకున్నారు. ఇక్కడ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత ఆయన బుధవారం మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలోని గ్రోమోర్ కార్యాలయంలో రైతులు, ఎరువుల వ్యాపారులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వారితో ముఖాముఖి మాట్లాడతారు. బైరవగుట్ట వద్దకు చేరుకుని రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి రైతులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వర్చువల్ గా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని వినడానికి వీలుగా కడప జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల తరువాత చిన్నదాసరిపల్లె లో పంటలు పరిశీలిస్తారు. ఆయన వెంట రైతులు కూడా అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులతో పాటు మహిళలు, కూలీలు, యువకులతో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి.
పెండ్లిమర్రిలో బటన్ నొక్కితే..
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు గ్రామంలో బటన్ నొక్కడం ద్వారా రైతుల ఖాతాలకు రెండు విడత అన్నదాత సుఖీభవ నిధులు ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. రెండు వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జత చేయడం ద్వారా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు 3,135 కోట్లు ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రైతు సేవా కేంద్రాల్లో పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది.
సీఎం షెడ్యూల్
మధ్యాహ్నం 1.15 గంటలకు పెండ్లిమర్రి మండలం జెడ్పి హై స్కూల్ వెల్లటూరు, హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
1.15గంటల నుంచి మ.1.25 మధ్య మధ్య ప్రజా ప్రతినిధులతో కలుస్తారు.
1.25 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం1.30 గంటలకు పెండ్లిమర్రి మండలం మన గ్రోమోర్ కేంద్రానికి చేరుకుంటారు.
1.30 గంటల నుంచి .35 గంటల వరకు మన గ్రోమోర్ సెంటర్(ఎరువుల దుకాణం) సందర్శన, రైతులతో ముఖాముఖి
1.40 గంటలకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక చేరుకుని మధ్యాహ్నం 1.40 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెండ్లిమర్రి మండలంలో "అన్న దాత సుఖీభవ -PM కిసాన్" కార్యక్రమం లో పాల్గొంటారు.
4.15 గంటలకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక నుంచి బయలుదేరి సాయంత్రం 4.20 గంటలకు చిన్నదాసరిపల్లి చేరుకుంటారు.
సాయంత్రం 4.20 గంటల నుంచి 5.05 గంటల వరకు చిన్నదాసరిపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల పరిశీలన, రైతులతో ముఖాముఖి.
5.15 గంటల నుంచి 6.15 వరకు వెల్లటూరు గ్రామంలో పార్టీ క్యాడర్ సమావేశం వేదికకు చేరుకుంటారు.
ఆ తరువాత రోడ్డుమర్గంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రాత్రి కి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.