వైద్య ఆరోగ్యంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ఆరోగ్యంగా ప్రజలు ఎలా ఉండాలో సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మిస్తామన్నారు.;

Update: 2025-04-07 12:20 GMT
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు

వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్​ను ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

చాలా ఆస్పత్రులు నుంచే వ్యాధులు ఇతర రోగులకు వ్యాపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి చెక్ పెట్టేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్​ టెన్షన్ కనిపిస్తోందని వెల్లడించారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉందని సీఎం వివరించారు.

తేలిక పాటి వ్యాయామం చేయాలి

'ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే చాలా వరకూ అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉండదు. కనీసం ఒక్క అరగంట పాటు తేలిక పాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాయామం చేయాలని కూడా పిలుపు ఇస్తున్నా. ప్రపంచం అంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశాం. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో కూడిన యాప్ ఇది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డబ్బులు ఏమి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్​ను ఇప్పటి వరకూ 4 లక్షల మంది డౌన్​లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు' అని చంద్రబాబు వెల్లడించారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ కార్డులు

ఏపీలో అందరికీ ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ అకౌంట్​ ద్వారా ఐడీ కార్డులు జారీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వ్యాన్ ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుందని తెలిపారు. మొత్తం 27 పరీక్షలు దీని ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ చేశామన్నారు. ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థతో పాటు, బిల్​గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడ్​టెక్ పార్క్ సహకరిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

'ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అవసరమైతే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాం. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తాం. ఇప్పటికే క్యాన్సర్​కు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును నియమించాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రపదేశ్​ తమ ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం దేశ వ్యాప్తంగా 25 గ్లోబల్ మెడిసిటీలను పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 100 ఎకరాల్లో దీనిని నిర్మిస్తాం' అని చంద్రబాబు అన్నారు.


ప్రణాళికా విభాగం వారికి అభినందనలు...

మరోవైపు ఏపీ ఆర్థిక అభివృద్ధి అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన పీయూష్ కుమార్ సహా ప్రణాళికా విభాగం అధికారులను సీఎం అభినందించారు. వారికి అరకు కాఫీ ఇచ్చి సత్కరించారు. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.3,11,004 లక్షల తలసరి ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వ్యవసాయం 16.47 శాతం,పరిశ్రమలు 17.32, సేవల రంగం 16 శాతం మేర పెరుగనున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.18.35 లక్షల కోట్ల జీఎస్డీపీ నమోదవుతుందని సీఎం అంచనా వేశారు.

ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్...

పొగాకు, ఆల్కహల్, డ్రగ్స్‌ దూరంగా ఉంటే మంచిదన్నారు. మిల్లెట్స్‌, బ్రౌన్ రైస్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. పంజాబ్ క్యాన్సర్ క్యాపిటల్ అయిందని.. దీని కౌంటర్ కోసం నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నామన్నారు. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్‌.. కిచెన్‌ యాజ్ ఏ ఫార్మసీ అని.. దీని వల్ల ప్రభుత్వ బడ్జెట్ కూడా తగ్గుతుందన్నారు. హ్యాపీగా ఉండాలంటే మంచి అలవాట్లు అవసరమన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌ నుంచే పిల్లలకు ఫుడ్ హ్యాబిట్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫేజ్ 2లో చిత్తూరులో 30 మండలాల్లో అమలు చేస్తామన్నారు. తరువాత స్టేట్ మొత్తం అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్‌లో ఉంచుతామన్నారు. గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టూ టైం అందుబాటులో ఉంటుందన్నారు. మానిటరింగ్, అలెర్ట్‌లు ఎప్పటికప్పుడు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జూన్ 15కు కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించి.. అనంతరం ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 70 చోట్ల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. మిగిలిన చోట్ల పీపీపీ మోడ్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News