శ్రీవారి పట్టువస్త్రాల సమర్పణలో "బాబు రికార్డు"
తిరుమలలో ఈరోజు సాయంత్రం ధ్వజారోహణం
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-24 10:08 GMT
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభసూచికగా ఇంకొన్ని గంటల్లో (సెప్టెంబర్ 24వ తేదీ) ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు తిరుమల శ్రీవారికి 16వసారి పట్టువస్త్రాలు సమర్పించడంలో రికార్డు నమోదు కాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డికి మాత్రమే ఐదేళ్లు అవకాశం దక్కింది.
రాష్ట్ర రాజకీయాల్లో, ప్రధానంగా నారా చంద్రబాబుకు 75 సంవత్సరాలు. 47 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. రాయలసీమ నుంచి నాల్గవసారి సీఎం పదవితో రికార్డు దక్కించుకున్న నారా చంద్రబాబు ఈ సంవత్సరం 16వసారి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించింది.
ఉమ్మడి రాష్ట్రం తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండడం ఓ రికార్డు. కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఆయనకు మాత్రమే ఈ అవకాశం దక్కింది.
రాయలసీమ ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితిని పరిశీలిస్తే, ఇప్పటి వరకు 26వ సీఎంగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉన్నారు. వారిలో ఏడుగురు మినహా, మిగతా వారంతా రాయలసీమ జిల్లాలకు చెందిన వారే. వారిలో దివంగత సీఎం వైఎస్ఆర్ కు మాత్రమే ఐదేళ్లు వరుసగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కింది.
ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి
తిరుమల శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ 1978 ఉంది. కాంగ్రెస్ పాలనలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్థనరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. అయితే కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2009 వరకు దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే వరుసగా ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రికార్డు నమోదైంది. ఆయన కొడుకు 2019 నుంచి 2024 వరకు వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లు మాత్రమే పట్టువస్త్రాలు సమర్పించారు. వారిద్దరు సీఎంల హోదాలో ఒంటరిగా వచ్చారు. మినహా కుటుంబసభ్యులు తిరుమలకు వచ్చిన దాఖలాలు లేవు.
"తిరుమల శ్రీవారికి ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు సమర్పించే ఘట్టం సాధారణంగా జరిగేది. మీడియా విస్తృతి లేకపోవడం వల్ల పెద్దగా తెలిసేది కాదు" అని తిరుపతిలో సీనియర్ జర్నలిస్టు రవికుమార్ వ్యాఖ్యానించారు.
"దేవాదాయ శాఖ తీసుకుని వచ్చే పట్టువస్త్రాలను సీఎం చేతుల మీదుగా తిరుమల శ్రీవారికి వేదపండితుల ద్వారా అందించే వారు" అని కూడా చెప్పారు.
"ఈ తరహా వాతావరణం అప్పట్లో కనిపించేది కాదు. తిరుమలలో జన్మించిన నేనే చూశాను. జర్నలిస్టుగా కూడా గమనించిన విషయం అది" తిరుమల సీనియర్ జర్నలిస్టు కేతారి సహదేవ్ అభివర్ణించారు.
"గతంలో దేవాదాయ శాఖ మంత్రి ద్వారా పట్టువస్త్రాలు కొనుగోలు చేసి, తీసుకుని వచ్చేవారు. ఆ వస్త్రాలను టీటీడీ వేదపండితులు వెండిపళ్లెంలో ఉంచి, సీఎం నెత్తిన పెట్టుకున్న తరువాత వేదమంత్రాల మధ్య మేళతాళాలతో శ్రీవారి ఆలయం వరకు తీసుకుని వెళ్లేవారు" అని సహదేవ తాను చూసిన విషయాలను వివరించారు.
ప్రస్తుతం టీటీడీనే పట్టువస్త్రాలు సమకూరుస్తున్నట్లు నాకు ఉన్న సమాచారం. అందుకు తగిన మొత్తం దేవాదాయ శాఖ టీటీడీ ఖాతాకు జమ చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది" అని కూడా సహదేవ చెప్పారు. ఇదిలావుంటే,
సీఎం హోదాలో నారా చంద్రబాబు ఇప్పటి వరకు అంటే 2004లో జరిగిన బ్రహ్మోత్సవాలకు తన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలిసి వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
2005 బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. దీనికి కోసం టీటీడీ, పోలీస్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.