కపిలేశ్వరాలయంలో బాబు ఏమని ప్రార్థించారు
ఆలయ ఆవరణలో కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చట్లు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-19 15:25 GMT
తిరుపతిలోని కపివేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం చంద్రబాబు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొంతసేపు పారిశుద్ధ్య కార్మికుడిగా మారిపోయారు. కర్రకు బిగించిన చీపురుతో ఆలయ పరిసరాలను కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. వ్యర్ధాలను తొలగించిన ఆయన కార్మికుల్లో ఒకరిగా మారిపోయారు.
కపిలేశ్వర ఆలయానికి వెళ్ళడానికి ముందే ఉన్న వరండాలో సీఎం చంద్రబాబు బండలు శుభ్రం చేశారు. ఒకపక్క జోరుగా వర్షం పడుతున్నప్పటికీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పనిచేసిన సీఎం చంద్రబాబు కొంతసేపు ఆనందంగా గడిపారు.
అంతకు ముందు కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద సీఎం చంద్రబాబుకు
పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. కపిలేశ్వరుడు, అమ్మవారు మిగతా పరివార దేవతలను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
ఆలయ ప్రధాన అర్చకుడు తో కలిసి ఏకాంతంగా మాట్లాడుకుంటూ సీఎం చంద్రబాబు రావడం ప్రత్యేకంగా కనిపించింది.
కపిలేశ్వర స్వామి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన సీఎం చంద్రబాబు
"రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ప్రజలకు మేలు జరగాలి" అని ప్రార్థించినట్లు చెప్పారు.
అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా, కుటుంబ సమేతంగా అనేక సందర్భాలలో అలిపిరి బైపాస్ రోడ్ లోనే ఉన్న కపిలేతీరుల మీదుగా తిరుమలకు వెళ్లేవారు. వాహనం నుంచే స్వామివారికి నమస్కరించుకుంటూ వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
దశాబ్దాల తర్వాత
తిరుపతి లేదా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు శ్రీవారిని మాత్రమే దర్శించుకునేవారు. శనివారం తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన ప్రత్యేకంగా కపిలతీర్థం వద్ద ఉన్న కపిలేశ్వరుని ఆలయానికి వెళ్లారు. దాదాపు 35 ఏళ్ల తరువాతే సీఎం చంద్రబాబు కపిల తీర్థాన్ని సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా తన వ్యవహార సరళిని ప్రదర్శిస్తున్న సీఎం చంద్రబాబు ఈసారి పర్యటనలో కపిలతీర్థం పర్యటనకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు.
మురిసిన కార్మికులు
కపిలేశ్వర స్వామి దర్శనానికి సీఎం చంద్రబాబు పర్యటన కారణంగా టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులను దర్శనాన్ని అనుమతించలేదు. సీఎం చంద్రబాబు ఒకరే అధికారులతో కలిసి వెళ్లారు.
అదే సమయంలో కొంతమంది టీటీడీ పారిశుద్ధ్య కార్మికులను కూడా ఆలయ ఆవరణలోనే ఉంచారు. స్వామివారి దర్శనం తర్వాత సీఎం చంద్రబాబు కార్మికులతో కలిసి కొద్దిసేపు పరిసరాలు శుభ్రం చేశారు. ఆ కార్మికులతో మాట్లాడుతూ కాలం గడిపారు. అక్కడ ఉన్న మహిళా కార్మికులతో ఆయన చాలా సేపు మాట్లాడారు. వారి కుటుంబ విశేషాలు, పిల్లల చదువులపై వాకబు చేసినట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు తమతో కలిసి పనిచేయడం, తమ కుటుంబ బాగోగులను తెలుసుకోవడంతో కార్మికులు సంబరపడిపోయారు. ఈ సన్నివేశం ఆలయంలో ప్రత్యేకంగా కనిపించింది. సమస్యలు కూడా తెలుసుకున్న చంద్రబాబు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.