మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

మాగుంట సుబ్బరామిరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశం. ఒంగోలు ఎంపీగా, కావలి ఎమ్మెల్యేగా పని చేసిన పార్వతమ్మ.

Update: 2024-09-25 07:43 GMT

ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్ధాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పార్వతమ్మ మృతి ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన సీఎం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాగుంట పార్వతమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. ఇటీవల ఆమె కుమారుడు మాగుంట విజయబాబు మృతి చెందారు. కుమారుడు మరణంతో ఆమె మరింత కుంగి పోయారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింతగా దెబ్బతినింది. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆమెను సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటీలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. పార్వతమ్మ భౌతికకాయన్ని బుధవారం మధ్యాహ్నం నెల్లూరులోని స్వగృహానికి తరలించనున్నారు. మాగుంట అభిమానుల సందర్శనం కోసం రేపు సాయంత్రం వరకు ఉంచనున్నారు. సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మరణానంతరం ఆయన వారసురాలిగా మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఒంగోలు ఎంపీగాను, కావలి ఎమ్మెల్యేగాను గతంలో పని చేశారు. 1996లో ఒంగోలు ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2004లో కావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి పార్వతమ్మ వదిన అవుతారు. మాగుంట కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా ఆయన కొనసాగుతున్నారు.
Tags:    

Similar News