చిత్తూరు: మరో ఘోర ప్రమాదం.. 40 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి.. తాజాగా జరిగిన సంఘటనలో 40 మందికి పైగానే గాయపడ్డారు
By : SSV Bhaskar Rao
Update: 2024-10-01 09:39 GMT
చిత్తూరు జిల్లాను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ తో సహా 40 మంది గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇవి.
మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. రాయచోటి నుంచి ప్యాసింజర్లతో బయలుదేరిన ఈ బస్సు గాలివీడు గుర్రంకొండ మీదుగా మదనపల్లికి బయలుదేరింది. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని సర్కారుతోపు అనే గ్రామ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన బాధితులందరినీ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంకొందరిని ఆటోలో కూడా తీసుకువచ్చారు. దీంతో..
మదనపల్లె జిల్లా ఆసుపత్రి ప్రాంగణం మొత్తం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల రోదనలతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశం నుంచి మదనపల్లికి రావడానికి 15 కిలోమీటర్ల పైగానే ప్రయాణం చేయాలి. అంతదూరాన్ని క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత కూడా మదనపల్లె పట్టణంలోని అధికారులు ఆసుపత్రి వద్దకు అలాగే సంఘటన ప్రదేశానికి వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో లారీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి, పరిస్థితి విషమంగా ఉన్న వారిని తిరుపతికి మెరుగైన చికిత్స కోసం తరలించలేని పరిస్థితి ఏర్పడిందని ఆ ప్రాంత జర్నలిస్టుల ద్వారా తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.