చిత్తూరును విషాదంతో నిద్రలేపిన శుక్రవారం..

చింతూరు ఘటనలో మృతులు చిత్తూరు, బెంగళూరు వారే..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-12 04:20 GMT
చింతూరు వద్ద లోయలో పడిన చిత్తూరు ప్రయివేటు బస్సు..

ఇంకో 24 గంటలు దాటితే వారం రోజుల పర్యటన ముగించుకుని ఆనందంగా ఇంటికి చేరే వారు. విధి 38 మంది పర్యాటకులతో చెలగాటం ఆడింది. చింతూరు వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లోయలోపడిన ఘటన నేపథ్యంలో విషాదవార్తతో చిత్తూరు జిల్లాను శుక్రవారం నిద్రలేపింది. శీతాకాలంలో పర్యాటక అందాలను చూడాలని చిత్తూరు నుంచి బయలుదేరిన యాత్రికుల బృందం ప్రమాదానికి గురైంది. మృతులు, గాయపడిన వారంతా చిత్తూరు నగరానికి చెందిన వారు. బెంగళూరులో ఉన్న బంధువులతో కలిసి ఈ నెల ఆరవ తేదీ చిత్తూరు నుంచి బయలుదేరారు.


రాత్రి వేళ మంచు ఎక్కువగా ఉండడం, డ్రైవర్ కు రోడ్డుపై అవగాహన లేకే ప్రమాదం జరిగినట్లు యజమాని చెబుతున్నారు.

"మాకు తెలిసిన సమాచారం మేరకు ఎనిమిది మంది మరణించారు" అని బస్సు యజమాని రామమూర్తి కొడుకు తిరుమలై ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఈ సంఘటనకు వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలోని మన్యం అల్లూరి సీతారామజిల్లాలో శుక్రవారం వేకువజామున ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
చింతూరు మండలం తులసిపాకాలు అనే అటవీప్రాంతం ఘాట్ రోడ్లో చిత్తూరు నుంచి బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సుఅదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.
చిత్తూరు జిల్లాకు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్టు అధికారులకు వర్తమానం అందింది. దీంతో మరణించిన వారు, గాయపడిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారినేది తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ
"మా అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు" అని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ Ap39 um 65 43 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 35 మంది యాత్రికులతో బయలుదేరినట్టు తెలిసింది. ఈ బస్సు కాణిపాకం సమీపంలోని మారేడుపల్లికి చెందిన ఏకే. రామమూర్తి యజమాని అనే సమాచారం అందింది.
చింతూరు సమీపంలోని మారేడుమిల్లి వద్ద ప్రమాదం జరిగిన సమాచారం అందడంతో బాధితులు ఏ ఊరి నుంచి బయలుదేరారు? అని వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తిరుపతి ఆర్టీవో మురళి కూడా స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి చితూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ప్రమాదానికి గురైన వారిలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
చింతూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్తూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారే మరణించిన వారిలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ సంఘటనపై బస్సు యజమాని రామమూర్తి కొడుకు తిరుమలై ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి మాట్లాడారు. ఆయన ఏమి చెప్పారంటే..
"చిత్తూరు నుంచి మా బస్సు 38 మంది యాత్రికులతో ఈ నెల 16 వ తేదీ బయలుదేరింది. 13వ తేదీ అంటే శనివారం తిరిగి రావాలి. శుక్రవారం అర్ధరాత్రి బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం తెలిసింది" అని తిరుమలై చెప్పారు.
చిత్తూరు నగరానికి చుట్టుపక్కల ఉన్న వారితో పాటు బెంగళూరుకు చెందిన వారం బంధువులు యాత్రకు బయలుదేరినట్టు తిరుమలై తెలిపారు.
"40 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలు ఉన్నా, 38 మంది మాత్రమే వెళ్లారు. ఘటన విషయం టీవీలో చూశాం. పోలీసులు వచ్చి చెప్పిన తరువాత విషయం తెలిసింది" అని తిరుమలై వివరించారు. బస్సు డ్రైవర్ ప్రసాద్ క్షేమంగా ఉన్నాడనీ, ఆయన ఫోన్ కు కాల్ చేస్తే, స్పందన లేదని తిరుమలై చెప్పారు.
Tags:    

Similar News