దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
భక్తుల రద్దీ పెరుగుతోంది. పసిపిల్లలు, దివ్యాంగులు, వయో వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు.;
విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దుర్గమ్మ దర్శనాల కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ఆలయ కమిటీ పెద్దలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఏ సమస్యలు లేకుండా ప్రశాతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
దీని కోసం వీఐపీల దర్శనాల వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు వీఐపీ దర్శనాలను నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని దుర్గమ్మ దేవాలయం ఈఓ శీనా నాయక్ శనివారం సాయంత్రం వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య దుర్గమ్మ అమ్మవారికి మçహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది వంటి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. నైవేద్య సమయంలో దర్శనాల విరామం వల్ల చిన్న పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్దులు ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి అలా ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాలుగు క్యూలైన్ల ద్వారా దుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని శీనా నాయక్ తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు దుర్గమ్మ అమ్మవారి దర్శనాల కోసం షెడ్యూల్ పెట్టుకోవద్దని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్‌ను మార్చుకోవాలని వీఐపీలకు దుర్గమ్మ ఆలయ ఈఓ శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు,