చిల్లర వార్తలతో చంద్రబాబు రాజకీయాలు

ప్రద్యుమ్నకు, నారా లోకేష్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.;

Update: 2025-09-04 10:42 GMT

చిల్లర వార్తలతో సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి సీఎం చంద్రబాబు చిల్లర వార్తలతో పాలన చేయడం, రాజకీయాలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రద్యుమ్నకి, నారా లోకేష్‌కు మధ్య సంబందాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రద్యుమ్న గతంలో స్టూడియో–ఎన్‌లో యాక్టివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారని, స్టూడియో–ఎన్‌ను నారా లోకేష్‌ ప్రమోట్‌ చేశారని, లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఖాతాలేని భీమ్‌ కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్‌ జరుగుతున్నాయి అని ఆయన ప్రశ్నించారు.

లిక్కర్‌ స్కామ్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. సిట్‌ పేరు చెప్పి తమపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిగా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్నట్లు తన మనుషులకు లాభం చేకూర్చేలాగా జరగలేదన్నారు. ఎల్లో మీడియా ఆఫీసుల్లో సిట్‌ అదికారులు పని చేస్తున్నారా లేకపోతే ఎల్లో మీడియా, సిట్‌ అధికారులు అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలోనే న్యూస్‌ ఫ్యాక్టరీలు పెట్టారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నకాలంగా జగన్‌ మీది పడి ఏడవాలా అని నిలదీశారు. విష ప్రచారం చేయడంలో లోకేష్‌ తండ్రి చంద్రబాబును మించిపోయారని, లోకేష్‌ ఆకార్యాలయమే ముఖ్యమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు.

మాజీ సీఎం జగన్, ఆయన తల్లి విజయమ్మ విషయంలో కూడా లోకేష్‌ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ ఫొటోలతో శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు అసలు కుటుంబ సంబంధాల గురించి తెలుసా అని నిలదీశారు. ధనవంతుల సీఎంలలో దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏమాత్రం న్యాయం చేశారని సజ్జల ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోని ఓ ఫేక్‌ సీఎం నారా చంద్రబాబు అని ధ్వజమెత్తారు. యూరియా సమస్యల కోసం ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతామని సజ్జల స్పష్టం చేశారు.

Tags:    

Similar News