ఎన్టీఆర్‌ ప్రస్తావనలేని చంద్రబాబు మహానాడు సందేశం

మహానాడు మొదలవుతున్న వేళ సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సందేశం ఇచ్చారు.;

Update: 2025-05-27 04:56 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు సందేశంలో ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావన లేకపోవడం, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను పరోక్షంగా ప్రస్తావించి పార్టీ శ్రేణులు సహకరించాలని కోరుతూ సోషల్‌ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు పంచుకున్న మహానాడు సందేశం తాజాగా ఆ పార్టీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్‌ ప్రస్తావన లేక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహానాడు 2025లో ఎన్టీఆర్‌ ఫొటో ఉంది. కానీ సీఎం చంద్రబాబు సందేశంలో ఎన్టీఆర్‌ ప్రస్తావనే కనిపించలేదు. ఎన్టీఆర్‌ ఫొటోను మధ్యలో పెట్టి ఇరువైపు సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ ఫొటోలను పెట్టి ముద్రించారు. అయితే సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తన 14 లైన్ల సోషల్‌ మీడియా సందేశంలో ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలను చేర్చే సాహసం చేయలేకపోయారు. తన కొడుకు నారా లోకేష్‌ను మాత్రం పరోక్షంగా ప్రస్తావించారు. ‘యువగళం’కు ప్రాధాన్యత ఇవ్వాలని తన కుమారుడు లోకేష్‌కు మద్ధతు పలుకుతూ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని పరోక్షంగా ప్రస్తావించారు. ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సోషల్‌ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు మహనాడు సందేశం ఇచ్చారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్వితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతర శ్రమిస్తున్నాం. తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టాం. మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యత ఇవ్వాలని ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, స్త్రీ శక్తికి పెద్దపీట వేయాలని, పేదల సేవలో నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వవిఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో.. ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి.. అదే నా ఆశ.. ఆకాంక్ష అంటూ ఎక్స్‌ వేదికగా తన సందేశాన్ని వెల్లడించారు.


Tags:    

Similar News