‘కాంగ్రెస్, ఎన్‌డీఏ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి’.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరువేరు రాష్ట్రాలు అయినా అవి తనకు రెండు కళ్ళు అని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Update: 2024-07-07 09:16 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేరువేరు రాష్ట్రాలు అయినప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలే విడిపోయాయి తప్ప ప్రజలు కాదని, ప్రజలు ఇప్పటికీ తాము ఒకే రాష్ట్ర ప్రజలుగా, సోదరుల తరహాలో మెలుగుతున్నారని అన్నారాయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి తెలంగాణలో ఎన్‌టీఆర్ భవన్‌కు విచ్చేశారు. అక్కడ ఆయనకు తెలంగాణ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రెండు తనకు రెండు కళ్ళు అని అన్నారు.

ఏపీ విజయంలో తెలంగాణ టీడీపీ పాత్ర

ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించడంలో తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశాయని చెప్పారు. ఎన్నికలు ఎక్కడైనా తమ పార్టీని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగాయని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పునఃవైభవం వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడకు ఆత్మీయులను కలిసి అభినందనలు తెలపాలని వచ్చాను. కానీ మీ అభిమానం చూస్తుంటే మరోసారి ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఏపీలో కూటమి సాధించిన విజయంలో టీడీపీ శ్రేణుల పాత్ర కూడా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సంతోషం వ్యక్తం చేశారు.

అధికారం లేకున్నా మీరున్నారు

‘‘తెలంగాణలో టీడీపీ పార్టీ అధికారంలో లేకపోయినా, కనీసం చెప్పుకునే స్థాయిలో కూడా లేని పరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. నన్ను జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపిన చొరవ, తెగువ మరువలేనిది. నా అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసనలు చేపట్టారు. మీ అభిమానాన్ని నేను ఎన్నటికి మరువలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలు టీవీలో చూసి గర్వపడ్డాను’’ అని చెప్పుకొచ్చారు.

రేవంత్‌కు కృతజ్ఞతలు

‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిపిన సమావేశంలో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దానిని రేవంత్ రెడ్డి కూడా స్వాగించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాలి. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. రెండు రాష్ట్రాల అభివృద్ధే టీడీపీ లక్ష్యం. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే వాటివల్లే నష్టాలే తప్ప లాభం ఎవరికీ ఉండదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని చెప్పారు.

కలిసి పనిచేస్తాం

‘‘తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య సిద్ధాంతపరమైన, ఆలోచనా పరమైన వ్యత్యాసాలు ఉన్నా తెలుగుజాతి ప్రయోజనాల కోసం రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. ప్రభుత్వం ఎవరిదైనా అభివృద్ధే ధ్యేయం. 2019 తర్వాత ఆంధ్రలో విధ్వంసకర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు విభజన కంటే వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ’’ అని అన్నారాయన.

Tags:    

Similar News