‘ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదు’.. చంద్రబాబు

ఆంధ్రలో వార్ వన్ సైడ్ అన్న తరహాలో జరిగిన ఎన్నికలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకంగా స్పందించారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎన్నడూ చూడలేదన్నారు.

Update: 2024-06-05 07:09 GMT

ఆంధ్రలో వార్ వన్ సైడ్ అన్న తరహాలో జరిగిన ఎన్నికలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకంగా స్పందించారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎన్నడూ చూడలేదన్నారు. తమ కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదని, ఐదేళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని, తమ హయాంలో మిగులు విద్యాత్ తీసుకొస్తే దానిని వైసీపీ సర్వనాశనం చేసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో తొమ్మదిసార్లు విద్యాత్ ఛార్జీలను పెంచి ప్రజలపై కరెంట్ భారం మోపారని వివరించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వైసీపీకి ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు.

ఈ ఎన్నికలు చారిత్రాత్మకం

‘‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసమే ఏకమై ముందుకు కదిలాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేయకుంటే వాటికి కూడా ప్రజలు ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ చేస్తారు. అదే మంచి పనులు చేస్తే ఎన్నిసార్లైనా ఆదరిస్తారు. ఈ ఏడాది జరిగినటువంటి చారిత్రాత్మక ఎన్నికలను నేను ఎన్నడూ చూడలేదు. విదేశాల్లో ఉండే వారు కూడా రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో కూటమికి మొత్తం 55.38 శాతం ఓట్లు వచ్చాయి. వాటిలో టీడీపీకి 45.60శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 39.37 శాతం ఓట్లే వచ్చాయి’’ అని వెల్లడించారు.

ఎంతో ఇబ్బంది పడ్డారు

‘‘వైసీపీ ఐదేళ్ల పానలతో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కంటినిండా నిద్ర కూడా లేదు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు. బెదిరించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన సన్నివేశాలను కూడా మనం ఎన్నో చూశాం. ఈ ఐదేళ్లలో జరిగిన అరాచకాలు చూసి ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకుంది. విశాఖకు వెళ్లిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను కూడా వెనక్కు పంపించేశారు. అన్యాయంగా కేసులు ఎందుకు పెట్టారని అడిగితే అరెస్ట్‌లు చేశారు’’ అని గుర్తు చేశారు.

మేం సేవకులం

‘‘మా మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. మేము పాలకులం కాదు ప్రజా సేవకులం మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పవన్ కూటమికి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ దిశగా అంతా కలిసి కృషి చేద్దామని పవన్ చెప్పారు. మా కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి అయింది. ఎలాంటి పొరపాటు లేకుండా అంతా కలిసి కట్టుగా పనిచేశాం. సమిష్టి కృషితోనే అనూహ్య విజయం సాధించగలిగాం’’ అని వివరించారు.

ఎన్డీఏతోనే ప్రయాణం…

తాము ఎన్డీఏలోనే ఉన్నామని, దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలను చూశానని చెప్పారు. ఎన్డీఏ సమావేశానికి తాను వెళుతున్నానని, ఎలాంటి సందేహాలు వద్దని, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News