అమరావతిపై క్యాబినెట్ తీర్మానం చేస్తే కేంద్రం వింటుందా?
చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది;
By : The Federal
Update: 2025-05-08 11:01 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును చట్టంలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి(Amaravathi) పేరు చేర్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడంతో పాటు పార్లమెంటు ఆమోదించాలి. అందుకు రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం పనికి వస్తుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన మే 8న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. అలాగే, ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి క్యాబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది.
ఈ తీర్మానం వల్ల ఏమి జరుగుతుందీ?
ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని ఏదీ అనే దానిపై స్పష్టత లేదు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ నోటిఫై చేయలేదు. పునర్ విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చాలంటే క్యాబినెట్ తీర్మానం అవసరం. చట్టంలో పలానా ప్రాంతం రాజధాని అని లేకపోవడం వల్ల పదేపదే రాజధానులు మార్చడం జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినపుడు అమరావతిని రాజధానిగా చేస్తే జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నారు. ఇలా జరగడం వల్ల అసలు రాజధాని ఏమిటో తెలియకుండా పోయింది. దీంతో ఇటీవల రైతులు చంద్రబాబును కలిసి అమరావతి ప్రాంతానికి చట్టభద్రత కల్పించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు కూడా సముఖత వ్యక్తం చేశారు. చట్టపరమైన భద్రత కల్పించాలంటే పార్లమెంటు ద్వారా పునర్ విభజన చట్టంలో చేర్చాలి. అందుకు క్యాబినెట్ తీర్మానం కావాలి. ఇప్పుడు ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టభద్రత కల్పించవచ్చునని భావిస్తున్నారు.