ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ ఇకలేరు
తన మాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన పట్టాభిరామ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.;
By : V V S Krishna Kumar
Update: 2025-07-01 12:24 GMT
ప్రముఖ ఇంద్రజాలికుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.ఖైరతాబాద్ లోని ఆయన నివాసంలో పార్థివదేహాన్నిఉంచారు.బుధవారం ఆయన అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు.తన మాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన పట్టాభిరామ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ వున్నారు.
బీవీ పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా,ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులు. అనేక పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వేలాది ప్రసంగాల ద్వారా ఆయన సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు.కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసేవారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్ ఎదిగారు.చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషిచేశారు.1984లో హైదరాబాద్ లో కళ్లకు గంతలు కట్టుకొని రవీంద్ర భారతి నుంచి ఛార్మినార్ వరకు స్కూటర్ నడిపి ఇంద్రజాల విద్యలో కొత్త అధ్యాయాన్నే సృష్టించారు.గోదావరి వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో ఒకరు పట్టాభిరామ్ . కౌమారదశలో కాలి వైకల్యంతో కలిగిన ఆత్మన్యూనతా భావాన్ని జయించి తనని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు.దూరదర్శన్‌లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించారు.క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకత.