ఫలించిన బీఆర్ఎస్ పోరాటం

బీఆర్ఎస్ ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి, హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

Update: 2024-08-15 07:00 GMT

మొత్తానికి ఒక విషయంలో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించిందనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించటంలేదని గోల గోల చేసిన విషయం తెలిసిందే. అధికారులను ప్రోటోకాల్ పాటించేట్లుగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు గవర్నర్, స్పీకర్ ను కలిసి విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. తాము ఎంఎల్ఏగా ఉన్న నియోజకవర్గాల్లో తమపై పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధులకు అధికారులు సకల మర్యాదలు చేస్తున్నారంటు నానా రచ్చచేశారు.

కారణం ఏదైనా కాని ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు ప్రోటోకాల్ దొరుకుతున్నట్లుంది. మెదక్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మామూలుగా అయితే ప్రతిపక్షంలోని ఎంఎల్ఏలను అధికారులు పట్టించుకోరు. ఎందుకంటే అధికారపార్టీ నేతలు ప్రతిపక్ష ఎంఎల్ఏలకు ప్రయారిటి ఇవ్వటాన్ని అంగీకరించరు. ఒకపుడు అధికారంలో ఎవరున్నా ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించేది. ప్రతిపక్షాల ఎంఎల్ఏలకు కూడా ప్రభుత్వం తగినంత గౌరవం ఇచ్చేది. అయితే సంప్రదాయ రాజకీయాల స్ధానంలో పవర్ పాలిటిక్స్ చోటు చేసుకున్నది. ఎప్పుడైతే పవర్ పాలిటిక్స్ ప్రవేశించిందో ప్రతిపక్షాలను తొక్కేయటం మొదలైంది. దాంతో ప్రోటోకాల్ కాదు కదా కనీసం గౌరవం కూడా దక్కటంలేదు.

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ఎంఎల్ఏలకు కొన్నిసార్లు సమాచరం కూడా ఉండటంలేదు. ఒకవేళ సమాచారం ఉన్నా ప్రతిపక్షాల ఎంఎల్ఏలు సదరు కార్యక్రమాలకు హాజరవ్వటంలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన అన్నది బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎంఎల్ఏలను కనీసం పట్టించుకోను కూడా లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే హస్తం పార్టీ ఎంఎల్ఏలను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా పెట్టినట్లు అప్పట్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలు మండిపడిన ఘటనలున్నాయి.

ఇపుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతోనే సీన్ రివర్సయ్యింది. దాంతో ప్రోటోకాల్ రగడను బీఆర్ఎస్ బాగా పెంచేసింది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏల విషయంలో ప్రోటోకాల్ పాటించమని రేవంత్ రెడ్డి నుండి ఆదేశాలు అందినట్లుంది. అందుకనే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని ప్రధాన ప్రతిపక్ష ఎంఎల్ఏల చేతుల మీదుగా జరిపిస్తున్నారు. ఇద్దరు ఎంఎల్ఏలు చెక్కులను పంపిణీ చేశారంటే మిగిలిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కూడా బాధితులకు చెక్కులను పంపిణీ చేసే ఉంటారు లేదా చేయబోతున్నారేమో. మొత్తానికి నానా గోలచేసి ప్రోటోకాల్ సమస్య విషయంలో బీఆర్ఎస్ విజయం సాధించినట్లే ఉంది.

Tags:    

Similar News