పీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ రచ్చ రచ్చ

పీఏసీ ఛైర్మన్ గా గాంధీని ఏ పద్దతిలో నియమించారో చెప్పాలని స్పీకర్ గడ్డంను అడిగారు.

Update: 2024-09-21 09:14 GMT

పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో బీఆర్ఎస్ రచ్చ రచ్చ చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశం చివరగా గొడవల మధ్యే ముగిసింది. పీఏసీ సమావేశంలో ఎందుకు గొడవ జరిగినట్లు ? ఎందుకంటే పీఏసీ ఛైర్మన్ గా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ గాందీని ఎలాగ నియమిస్తారంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, ఎంఎల్ఏలు నానా గొడవ చేసిన విషయం తెలిసిందే. ఈ గొడవ వల్లే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్ళి నానా గొడవ చేసింది. చాలా రోజుల క్రితమే గాంధీ బీఆర్ఎస్ ను వదిలేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు స్వయంతా తానే చెప్పుకున్నారు.

అలాంటిది పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు గాంధీ చేసిన ప్రకటనతో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద గొడవే అయ్యింది. అప్పటినుండి గాంధీని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడా గాంధీ అధ్యక్షతన పీఏసీ మీటింగ్ జరిగితే కమిటీ సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రచ్చ చేయకుండా ఉంటారా ? ఇపుడు జరిగింది అదే. సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో పాటు కమిటీ సభ్యులు కాంగ్రెస్ నుండి ఎంఎల్సీ జీవన్ రెడ్డి, ఎంఎల్ఏ యెన్న శ్రీనివాసరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎంఐఎం నుండి బలాల, బీజేపీ నుండి రామారావు పవార్, బీఆర్ఎస్ నుండి వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాదరావు, సత్యవతి రాథోడ్, ఎంఎల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.

సమావేశం మొదలుకాగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు వేముల, గంగుల మాట్లాడటం మొదలుపెట్టారు. పీఏసీ ఛైర్మన్ గా గాంధీని ఏ పద్దతిలో నియమించారో చెప్పాలని స్పీకర్ గడ్డంను అడిగారు. పీఏసీ ఛైర్మన్ పదవిని ఎలక్షన్లో భర్తీ చేశారా ? లేకపోతే సెలక్షన్ ద్వారా చేశారా అని నిలదీశారు. బీఆర్ఎస్ తరపున ఐదుగురు సభ్యుల పేర్లు ఇచ్చినపుడు సంబంధంలేని గాంధీని ఛైర్మన్ గా ఎలా నియమించారని స్పీకర్ ను నిలదీసినా జవాబురాలేదు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు అసహనంతో నానా గోలచేశారు. కారుపార్టీ సభ్యుల ప్రశ్నలకు స్పీకర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవటంతో పాటు సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబే సమాధానం చెప్పారు. దాంతో మండిపోయిన బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుండి వాకౌట్ చేశారు.

Tags:    

Similar News