పుస్తకాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి: పవన్
విజయవాడలో ’ఆమె సూర్యుడిని కబళించింది‘ పుస్తకావిష్కరణలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పూరి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలి. నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటా. ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఐక్యరాజ సమితి అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ గా, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం డిప్యూటీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ప్రముఖ భారతీయ దౌత్యవేత్త లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన Swallowing the Sun తెలుగు అనువాదం “ఆమె సూర్యుడిని కబళించింది” పుస్తకం. రెండు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా పనిచేసిన లక్ష్మీ మురుదేశ్వర్ పూరి మహిళల గురించి, మహిళా సాధికారత, వారి గొప్పతనాన్ని గురించి ఇలాంటి గొప్ప పుస్తకాన్ని రచించి ప్రజలకు అందించినందుకు అభినందిస్తున్నట్లు పవన్ కల్యాన్ చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి మహిళల జీవిత విధానం, వారి పోరాటాన్ని, ఎదుర్కొన్న పరిస్థితులను మాలతి అనే పాత్ర ద్వారా అద్భుతంగా ఈ నవల ద్వారా వివరించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ, తెలుగు అనువాదం చేసిన ఎ. కృష్ణారావు, ఎంఎస్‌కె పబ్లికేషన్ ఎంఎస్‌కె విజయకుమార్ పాల్గొన్నారు.