నకిలీ మద్యం తయారీ కేసులో జనార్ధన్ ఉక్కిరి బిక్కిరి
ఆ మూడే కాదు, మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయన్న ప్రధాన సూత్రధారి జనార్దన్
By : The Federal
Update: 2025-10-11 10:33 GMT
నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో దర్యాప్తు ముమ్మరమైంది. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అధికాలు శనివారం ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్దెపల్లి జనార్దనరావును శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జనార్దన్‌రావు ఇప్పటిదాకా జరిగిన కీలక వివరాలను వెల్లడించారు.
ఇప్పటి వరకు బయటపడిన మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, భవాని పురం, పరవాడ తరహాలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ మద్యం యూనిట్లు ఉన్నాయని జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖలో పాత నేరస్తుడు వెంకట్‌కు చెందిన స్థావరంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. శ్రీకాకుళంలోని సారవకోట మండలంలో, అనకాపల్లి పాయకరావుపేట హైవేలోని పలు ట్రేడర్స్‌లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొంత మంది పేర్లు బయటకు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా సోమవారం ఉదయం- జనార్ధన్ రావును కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
నకిలీ మద్యం తయారీ కేసులో...
నకిలీ మద్యం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి 90 ఎంఎల్ సీసాలలో రకరకాల మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 14మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 12వ నిందితుడైన కళ్యాణ్- జనార్దన్ రావు పిన్ని కొడుకు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన ల్యాండ్‌ను కొనుగోలు చేశాడు. అది నకిలీ మద్యం సొమ్మేనని పోలీసులు భావిస్తున్నారు.
ములుకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్‌లను జనార్దన్ రావు(Janardhan Rao) నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు తేలింది. బెల్ట్ షాపులుతో మొదలు పెట్టి.. వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో.. మరో టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకి మద్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఏ నిమిషంలోనైనా జయచంద్రారెడ్డి అరెస్ట్..
నకిలీ మద్యం తయారీ కేసులో మరింత మందిని నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న కట్టా రాజు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుల సంఖ్య ఇప్పటికే 23కి పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏ-17గా జయచంద్రారెడ్డి, ఏ-18గా గిరిధర్‌రెడ్డిల పేర్లనూ కేసులో చేర్చారు. రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించడానికి కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది.
ఇప్పటికే తమ అదుపులో ఉన్న కీలక నిందితుడు ఏ-1 జనార్దన్‌రావు నుంచి పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలక నిందితుడైన జయచంద్రారెడ్డి అరెస్టుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. బెంగళూరులో ఆయన ఉంటున్న స్థావరాలను గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి కూడా లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్‌రావు.. జయచంద్రారెడ్డికి స్నేహితుడు కావడంతో ములకలచెరువుకు వచ్చిన సమయంలో పలువురితో పరిచయం పెంచుకున్నారు. వీరి ద్వారా నకిలీ మద్యం తయారుచేసి నియోజకవర్గంలో వైన్‌షాపులు, బెల్ట్ షాపుల ద్వారా విక్రయించినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.
జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేస్తున్న అన్బురాసు (బాబు) బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ఏ-2గా ఉన్న కట్టా రాజు వాంగ్మూలం ఆధారంగా బాబుపై పోలీసులు నిఘా ఉంచారు. నిందితులు బాబు, అష్రఫ్‌లను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారిస్తే.. మరికొందరు పాత్రధారుల పేర్లు వెల్లడయ్యే అవకాశముంది.
ఈ కేసు నిందితుల్లో ఒకరైన చైతన్యబాబు పీటీఎంలోని ఆంధ్రా వైన్స్ దుకాణం మేనేజర్‌గా పని చేశారు. ఆంధ్రా వైన్స్‌ను కట్టా సురేంద్రనాయుడి నుంచి స్వాధీనం చేసుకున్న గిరిధర్‌రెడ్డి.. చైతన్యబాబును మేనేజరుగా నియమించుకుని వ్యవహారాలు నడిపారు.
బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్ వాసి నకిరేకంటి రవిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఆబ్కారీ పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.