నాటి రోనాల్డ్ రాస్ ల్యాబ్ లో ఇపుడు మంచినీళ్లు కూడా లేవు
ఎవరికీ పట్టని సర్ రోనాల్డ్ రాస్ ‘పరిశోధనాకేంద్రం’
బేగంపేటలోనే, మలేరియా వ్యాధిపై సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి గెల్చుకున్నారు. ఆయన పరిశోధనా చేసిన భవనాన్ని 2008లో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. ఆ ప్రదేశ పరిరక్షణ, ప్రచారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2010 -12లో రూ.45 లక్షలతో భవన పునరుద్ధరణకు పనులు చేపట్టారు. మరిన్ని నిధులు సేకరించి అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత వాటిని ఫాలో అప్ చేయకపోవడంతో నిధులు రాలేదు. పనులు ఎక్కడి వక్కడే నిలిచి పోయాయి.
సుమారు 12000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆయన ప్రయోగాలు చేసిన పెంకుటిల్లు, రోనాల్డ్ రాస్ స్మృతి చిహ్నంగా మిగిలిన ఆ రోడ్డు, అప్పట్టి ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఒక వాచ్ మెన్ ఉదయం వెళ్లి గేట్లు తీసి, సాయంత్రం తలుపులు మూసి వెళ్ళిపోతాడు. ఓయూ అధికారులు సైతం ఏడాదిలో రెండు సార్లు... అంటే సర్ రోనాల్డ్ రాస్ జయంతి రోజు అయిన మే13న, ఆయన పరిశోధనల ఫలితాలను వెల్లడించిన ఆగస్టు 20న వెళ్లి ఆయన విగ్రహానికి దండలు వేసి నివాళులర్పించి వెళ్లిపోతున్నారు. మిగతా రోజుల్లో అటు వైపు కనెత్తి చూడటం లేదు. "ఎందుకంటే కంటోన్‌మెంట్ పరిధిలో వున్న రోనాల్డ్ రాస్ భవనానికి కేంద్ర అధికారులు వాటర్ కనెక్షన్ కట్ చేశారు. కనీసం బాత్‌రూంకు వెళ్లాలన్నా చుక్క నీరు లేదు. దీంతో ఈ ప్రాంతం భూత్ బంగ్లా గా మారింది.
ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడి నుంచి దోమలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పట్టికీ దోమ కాటుతో అనేక మంది చనిపోతున్నారని" ఉస్మానియా విశ్వ విద్యాలయం జంతు శాస్త్ర విభాగం డైరెక్టర్ రెడ్యానాయక్ ది ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
18వ శతాబ్దంలో మలేరియా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మందిని కబళించింది. ప్రజల్ని చంపుతున్న మలేరియా వ్యాధికి కారణాలను కనుగొనడంలో అప్పటికే శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రోనాల్డ్ రాస్ ఆ దిశగా తన పరిశోధనపై దృష్టి పెట్టారు.
ప్రస్తుతం ఉన్న రోనాల్డ్ రాస్ భవనాన్ని అప్పట్లో బేగంపేట మిలిటరీ హాస్పిటల్ అని పిలిచేవారు. ఆ ఇంటి చుట్టూ చిత్తడి నేలలు ఉండేవి. అది అతని పరిశోధన ప్రయోగాలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. వైద్యాధికారిగా పనిచేస్తూ, ఉష్ణ మండలాల్లో ప్రబలే వ్యాధులపై పరిశోధనలు చేస్తుండేవారు. పిళ్లై అనే మరో వైద్యాధికారితో కలిసి హుస్సేన్‌సాగర్, మూసీ పరిసర ప్రాంతాలకు వెళ్లి దోమలను పట్టుకుని వచ్చేవారు. అలా దోమలు, వాటి జీవిత చక్రంపై పరిశోధనలు కొనసాగించారు.
సికింద్రాబాద్‌లో పనిచేసేటప్పుడు అతని గురువు మాన్సన్‌కు లేఖ వ్రాశాడు: “వేడి భయంకరంగా ఉంది. ఆ వేడి ఇంజిన్ ఫర్నేస్ పేలుడు లాంటిది” అని తన బాధను వ్యక్త పరిచాడు.
"పరీక్ష కోసం రక్తపు చుక్కల్ని సేకరించడానికి సూదితో వేళ్లను గుచ్చడానికి ప్రయత్నించినప్పుడు, స్థానిక రోగులు భయపడే వారు. కొందరు అతను చేతబడి మంత్ర విద్యను అభ్యసిస్తున్నాడని భావించేవారని" ఆ లేఖలో రాశాడు. "ఆ సమయంలో చాలా మంది జ్వరంతో బాధపడుతూ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉండేవారు. అందుకు మలేరియానే కారణమని గుర్తించిన రోనాల్డ్ రాస్, ఆ వ్యాధి సోకడానికి కారణం ఏమిటనే దానిపై ఆసుపత్రి ప్రాంగణంలోనే తన పరిశోధనలు కొనసాగించారు".
మే 27, 1896న, అతను మాన్సన్‌కు ఇలా వ్రాశాడు: “ఈ వ్యాధి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందనే నమ్మకం నాలో పెరుగుతోంది.” జూలైలో, దోమలు విముక్తి పొందిన వెంటనే “ఫ్లాగెల్లా” వాటి ప్రేగు నుండి అదృశ్యమవుతుందని అతను గమనించాడు. జూన్ 18, 1897న, అతను మళ్ళీ సికింద్రాబాద్‌కు చేరుకుని తన మలేరియా పనిని తిరిగి ప్రారంభించాడు. అంతు చిక్కని ఈ మహమ్మారి అనాఫిలిస్ అనే ఆడ దోమ కుట్టడంద్వారా సంక్రమిస్తుందని రోనాల్డ్‌రాస్ గుర్తించాడు. మలేరియా వ్యాప్తికి దోమకాటే కారణమని నిరూపించారు. 1897 ఆగస్టు 20న ఈ ఇంటిలోనే కనుగొన్నాడు.
ఆయన పరిశోధనా ఫలితాల వల్ల దోమల నివారణతో పాటు మలేరియాకు మందుల ఆవిష్కరణ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ఈ పరిశోధనలకు గాను రోనాల్డ్ రాస్ కు 1902 లో నోబెల్ బహుమతి లభించింది. సికింద్రాబాద్ బేగంపేటలోని ఇన్సిట్యూట్ లో పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఆయన తన పరిశోధనల ఫలితాలను ఎప్పటికప్పుడు నోట్స్ బుక్ లో రాసుకున్నాడు. ఆ నోట్స్ ఇప్పటికీ లండన్ లోని ఓ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి.
పదే పదే ఎదురు దెబ్బలతో, ముఖ్యంగా తన మలేరియా పరిశోధన కొనసాగించడు రోనాల్డ్ రాస్. ఇండియాలో రాస్‌కు డాక్టర్‌గా మొదటి పోస్టింగ్ మద్రాస్‌లో, తర్వాత కోల్‌కతా ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. చుట్టు పక్కల గ్రామాల నుంచి దోమల్ని సేకరించి వాటిపై ప్రయోగాలు చేస్తుండేవాడు. అక్కడి నుంచి బెంగళూరుకు బదిలీ అయ్యాడు. అక్కడ కూడా ప్రయోగాలు జరిపాడు. మళ్ళీ బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళిన రాస్‌కు మలేరియా వచ్చింది. దాంతో ఆయన్ని అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని బిటిష్ ఆర్మీ యూనిట్‌లో వైద్యాధికారిగా 1893లో నియమించారు. 1895 సెప్టెంబర్ ప్రారంభంలో, రాస్‌ను బెంగళూరుకు ప్రత్యేక పారిశుధ్య విధులపై పంపిచారు. అలా 18 నెలలు మలేరియాపై పరిశోధనలు ఆగిపోయాయి. బర్మా యుద్ధంలో అండమాన్‌లలో పనిచేశాడు. భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల పాటు సైనిక సేవలో గడిపాడు.
ఆ కాలంలో రాస్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని సీరియస్‌గా తిట్టాడు. పనికిరాని ప్రభుత్వం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. "సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో అస్సాంకు వెళ్లాల్సి వచ్చింది. ప్లేగు టీకాలు వేస్తున్నారని. వాస్తవానికి కలరా ప్లేగు వ్యతిరేక టీకాలు వేస్తున్నారని పుకార్లు వ్యాపించాయి. రెండు చుక్కల రక్తాన్ని పొందడానికి, మలేరియా కేసులను కనుగొనడం దాదాపు అసాధ్యం అయింది".
ఫిబ్రవరి 22, 1899న, రాస్ కలకత్తా నుండి నౌకాయానం చేసి మార్చి 20న లండన్ చేరుకున్నాడు. ఏప్రిల్ ప్రారంభంలో, అతను లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ట్రాపికల్ మెడిసిన్‌లో లెక్చరర్ అయ్యాడు. జూలై 31న, అతను ఇండియన్ మెడికల్ సర్వీస్ నుండి మేజర్‌గా పదవీ విరమణ చేశాడు.
అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం రోనాల్డ్ రాస్‌ను బదిలీలు చేస్తూ తెగ ఇబ్బంది పెట్టినప్పట్టికీ, తాను ఎంతో పట్టుదలతో సికింద్రాబాద్‌లోని ఈ ప్రయోగశాలలోనే మలేరియాకు పరిష్కారం చూపాడు. నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. అలాంటి ప్రదేశం పట్ల, పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
1935లో, స్థానిక పౌర సంస్థ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, రాస్ సాధించిన విజయానికి ప్రశంసగా ఒక పాలరాయి ఫలకాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది.
రాస్ స్మృతిని ప్రచారంలోకి తేవడానికి 1955లో, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర ప్రొఫెసర్ సత్యనారాయణ సింగ్ అప్పటి దక్కన్ ఎయిర్‌లైన్స్ నుండి భవనాన్ని కొనుగోలు చేసి, ఈ భవనంలో రొనాల్డ్ రాస్ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ భవనం ఉస్మానియా విశ్వ విద్యాలయం జంతు శాస్త్ర విభాగం ఆధీనంలో వుంది.
1997లో, రోనాల్డ్ రాస్ ఆవిష్కరణ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 30 దేశాల నుండి సుమారు 700 మంది శాస్త్రవేత్తలు ఈ భవనం వద్ద సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, బ్రిటిష్ హై కమిషన్ ఈ భవనాన్ని US $51,000 ఖర్చుతో పునరుద్ధరించింది. వారసత్వ భవనం కావడంతో, భారత పురావస్తు సర్వే సంస్థ దాని మరింత అభివృద్ధి కోసం 6,50,000 రూపాయలు మంజూరు చేసింది. అదనంగా, ఈ సౌకర్యాన్ని అత్యుత్తమ కేంద్రంగా మార్చడానికి భవనం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను ప్రకటించారు. తెలంగాణా ప్రభుత్వం సర్ రొనాల్డ్ భవనంగా పేరు పెట్టింది. అంతే కాదు ఆ భవనానికి దారి తీసే రోడ్డుకి కూడా ఆయన పేరే పెట్టారు. ‘సర్ రొనాల్డ్ రాస్ బిల్డింగ్’ ప్రత్యేక పోస్టల్ కవర్ ను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఆ భవనాన్ని మళ్ళీ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
ప్రపంచంలో యుద్ధాల వల్ల చనిపోయిన వారి కంటే ఎక్కువ మంది దోమ కాటుతో చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మందిని చంపేస్తున్నవి దోమలే. యూనిసెఫ్ నివేదిక ప్రకారం మలేరియా ప్రమాదం ఎక్కువగా ఉన్నప్రాంతాల్లోనే, ప్రపంచవ్యాప్తంగా 40 శాతం జనాభా నివాసం ఉంటోంది. ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా ప్రాణాలు పోవడానికి కారణం దోమలే. ఇవే లేకుంటే ప్రపంచంలో సగం రోగాలు ఉండవట. ఎందుకంటే వాటిని వ్యాపింప చేసేది దోమలే. దోమలు ఏం చేస్తాయంటే, ముందుగా తమలోకి ఆ వైరస్ ను చేర్చుకుంటాయి. వాటిని మోసుకుంటూ తిరుగుతాయి. మనిషిని కుట్టినప్పుడు రక్తంలోకి ఆ వైరస్ చేరుతుంది. ఆ రోగం మనిషికి అంటుకుంటుంది. ఇలా ఏటా 70 కోట్ల మందికి రోగాలను అంటిస్తున్నాయి దోమలు. పరిస్థితి చేయిదాటిపోయి పదిలక్షల మందిపైనే మరణిస్తున్నారు.