పొల్యూషన్ ఆడిట్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తాం

ఉప్పాడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలు, పరిశ్రమలలో కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపైన పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.

Update: 2025-10-11 10:31 GMT

పొల్యూషన్ ఆడిట్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా  శనివారం సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులు, పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. కాలుష్యం వల్ల ఉప్పాడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పారిశ్రామిక కాలుష్యం ద్వారా తలెత్తుతున్న పర్యావరణ సమస్యలపై తీవ్ర చర్చ చేపట్టారు. పొల్యూషన్ ఆడిట్‌ల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 

కాకినాడలో మత్స్యకారులతో చేపట్టిన సమావేశంలో వారు ప్రస్తావించిన అంశాలు, వెలిబుచ్చిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు సేకరించారు. కాలుష్య నియంత్రణ మండలి చేపట్టబోయే పొల్యూషన్ ఆడిట్‌కు అనుసరించాల్సిన విధానాలు, కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై చేపట్టాల్సిన చర్యలు పై విస్తృతంగా చర్చించారు. ఈ సమీక్ష జిల్లాలోని పర్యావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారాలకు దారితీస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య, మెంబర్ సెక్రటరీ పి. శరవణన్ IFS, సీనియర్ ఇంజనీర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, SP, ఇతర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News