‘కేంద్రం తెచ్చిన జీవో ఆంధ్రకు ఉరితాడే’.. సీఎంకు బొజ్జా దశరథరామిరెడ్డి లేఖ

కేంద్రం తెచ్చిన జీవో 4375(ఈ) ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడే అవుతుందని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.ఈ జీవో రద్దు దిశగా కృషి చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Update: 2024-07-17 10:19 GMT

ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులకు విఘాతం కలిగించే విధంగా కేంద్రం తెచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రద్దుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జి.వో లోని నూతన విచారణ అంశాలతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు విఘాతం కలిగే దిశగా ప్రమాదం ఘంటికలు స్పష్టంగా వినిపిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రద్దుకై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దశరథరామిరెడ్డి బుధవారం లేఖ వ్రాసారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి నంద్యాల సమితి కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎస్‌.వో‌. 4375(ఈ) తేదీ 6.10.2023, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కులపై తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను కలగజేస్తుందని లేఖలో వివరించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా చేర్చిన చర్చనీయ అంశాలు (Terns of Reference) ను పరిగణలోకి తీసుకొని బ్రిజేష్ కుమార్ కమిటీ చేపడుతున్న విచారణలు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నది జలాలను ప్రాజెక్టుల వారీగా పంపకం చేసిన విషయం తెలిసిందేనని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను సుప్రీంకోర్టులో కూడా మార్చడానికి వీలు లేకుండా పార్లమెంటు చట్టం చేసిన విషయయాన్ని ఈ సందర్భంగా బొజ్జా గుర్తు చేసారు. ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా పొందుపరచారని ఆయన పేర్కొన్నారు. కాని వీటన్నిటిని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి హక్కులను కాలరాస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం జి. వో. ను తీసుకొని రావడంపై ఆయన ఆక్షేపించారు.

ఆంధ్రప్రదేశ్ నీటిహక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జీవో తక్షణమే రద్దు చేయించాలని గత ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఈ రాజ్యాంగ విరుద్ధమైన గెజిట్‌ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాకుండా నిలువరించడంలో, అదేవిధంగా చట్టపరంగా దీనిని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పర్యవసానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కులను ఎన్ బ్లాక్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల నీటి హక్కులను పునఃసమీక్షించి తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించే దిశగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది.

ఈ విచారణల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుంచిన “స్టేట్ మెంట్ ఆఫ్ కేస్” కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి చివరి అవకాశంగా నాలుగు వారాల సమయాన్ని ఈ నెల 15 న జరిగిన విచారణ సందర్భంగా ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రమాదపు ఘంటికలు మోగుతున్నాయనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ విరుద్ధ గెజిట్ నోటిఫికేషన్ రద్దు దిశగా తక్షణమే స్పందించి, ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులను కాపాడాలని దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. ఈ విషయమై చంద్రబాబునాయడు గారు తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఈ జీవో రద్దు చేసే దిశగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవాలని బొజ్జా కోరారు.

Tags:    

Similar News