బీఆర్ఎస్ ఓటుబ్యాంకుపై బీజేపీ కన్ను ?

కారుపార్టీ ఓట్లు తమపార్టీ అభ్యర్ధులకు వేయించి గెలిపించేట్లుగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మంతనాలు జరుగుతున్నాయా ? లేకపోతే ఫైనల్ అయిపోయిందా ?;

Update: 2025-02-11 12:26 GMT

ఈనెల 27వ తేదీన జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటుబ్యాంకుపై బీజేపీ కన్నేసిందా ? కారుపార్టీ ఓట్లు తమపార్టీ అభ్యర్ధులకు వేయించి గెలిపించేట్లుగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మంతనాలు జరుగుతున్నాయా ? లేకపోతే ఫైనల్ అయిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన ఆరోపణలు చూసిన తర్వాత అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు ఎంఎల్సీ సీట్ల భర్తీకి(MLC elections) ఈనెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మూడింటిలో రెండు టీచర్ ఎంఎల్సీ సీట్లయితే, ఒకటి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటు. ఈ మూడింటిలో కూడా ఒక టీచర్, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీట్లు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో పై రెండు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. మిగిలిన మరో టీచర్ ఎంఎల్సీ సీటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో ఉంది.

పైమూడు ఎంఎఎల్సీల సీట్లను ఎలాగైనా గెలుచుకోవాలని ఇటు అధికార కాంగ్రెస్(Congress) అటు ప్రతిపక్ష బీజేపీ(BJP)లు గట్టిప్రయత్నాలు చేస్తున్నాయి. కారణంఏమిటంటే ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) పోటీలో లేకపోవటమే. ఓటమిభయంతోనే బీఆర్ఎస్ ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీనుండి తప్పుకున్న విషయం అర్ధమైపోతోంది. అయితే ఇందులోనే మరో అంతర్గత కారణం కూడా కనబడుతోంది. అదేమిటంటే తన ఓటుబ్యాంకును బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ గెలుపుకు మళ్ళించటం. ఇదేవిషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC president Bomma Mahesh kumar goud) మాట్లాడుతు ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించినట్లుగానే రాబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు.

పార్లమెంటు ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్ధులను కూడా ఓడించేందుకు తమ ఓట్లన్నింటినీ బీజేపీ అభ్యర్ధుల గెలుపుకు కేసీఆర్ మళ్ళించారని బొమ్మ ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో నుండి తన కూతురు కల్వకుంట్ల కవిత(Kavitha)ను రక్షించుకునేందుకే కేసీఆర్ పార్టీ అభ్యర్ధుల ఓటమికి సిద్ధపడినట్లు బొమ్మ ఎద్దేవాచేశారు. అప్పుడు చేసినట్లుగానే రాబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓట్లను బీజేపీ అభ్యర్ధుల గెలుపుకు సహకరించేట్లుగా మళ్ళించాలని లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బొమ్మ ఆరోపించారని కాదుకాని క్షేత్రస్ధాయిలో పరిణామాలు కూడా అనుమానంగానే ఉన్నాయి. అనుమానాలు ఏమిటంటే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా పోటీచేయటానికి బీఆర్ఎస్ నేతలు చాలామందే ప్రయత్నించారు. అయితే పార్టీ పోటీచేయటంలేదని కేసీఆర్ కచ్చితంగా చెప్పేశారు.

పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారంచేద్దామని నేతలు అడిగినా కేసీఆర్ వద్దన్నారు. పోటీ చేయనీక, ఇండిపెండెంట్లకూ మద్దతు ప్రకటించకపోవటంలో కేసీఆర్ ఆంతర్యం ఏమయ్యుంటంది ? ఇక్కడే కేసీఆర్ వైఖరిపై చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. బొమ్మ ఆరోపించినట్లుగా బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఏమన్నా జరిగాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నయి. పార్టీ ఓట్లను ఎవరికైనా వేసుకునే స్వేచ్చ కల్పించినట్లుగా పైకి కలరింగ్ ఇస్తు లోలోపల మాత్రం కమలంపార్టీ అభ్యర్ధులకు వేయమని ఆదేశాలు జారీచేశారని పీసీసీ అధ్యక్షుడు చేసిన ఆరోపణల్లో లాజిక్ లేకపోలేదు. అయితే బీఆర్ఎస్ ఓట్లకోసం కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

బీజేపీకి వేసే ఓట్లు నిరుపయోగమని, కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గాల అభివృద్ధితో పాటు చాలా ఉపయోగాలు ఉంటాయని మంత్రులు చెబుతున్నారు. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎంఎల్సీ పోస్టు పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 పార్లమెంటు నియోజకవర్గాలుంటాయి. కాబట్టే గెలుపుకోసం రెండు ప్రధానపార్టీలు ఇంతగట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరి చివరకు ఎవరి మంత్రాంగం ఫలిస్తుందో ? విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News