అన్ని జిల్లాల్లోనూ నగరాలు కు బీసీ-డి సర్టిఫికెట్లు: మంత్రి సవిత
నగరాలు సామాజిక వర్గం బీసీ-డిలో ఉన్నప్పటికీ నాలుగు జిల్లాల్లోనే కుల ధృవీకరణ ఇస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సర్టిఫికెట్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2025-07-06 11:41 GMT
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల సామాజిక వర్గీయులను బీసీ-డీలుగా గుర్తించి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సామాజిక వర్గీయులతో కలిసి టీడీపీ బీసీ నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిళ్ల తిరుమలష్ కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని జీవో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖతో పాటు కృష్ణా జిల్లాలో మాత్రమే నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారన్నారు. మిగిలిన జిల్లాలో బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవితను వారు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ పై అధికారులతో మాట్లాడతానన్నారు. జీవో ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలందరినీ బీసీ-డీలుగా గుర్తించి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు కుమార్ నాయుడు, నల్లాని గిరిధర్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.