బండికి ఇంత కోపమా ? బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ ఎలాగవుతుంది ?
8 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ, 38 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ను ఔట్ డేటెడ్ పార్టీ అనటమే ఆశ్చర్యంగా ఉంది.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. బండి మాట్లాడుతు బీఆర్ఎస్ ను ఔట్ డేటెడ్ పార్టీగా అభివర్ణించటమే విచిత్రంగా ఉంది. కారుపార్టీ జోరు తగ్గిందే కాని ప్రయాణం ఎక్కడా ఆగలేదు. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమని అందరికీ తెలిసిందే. 2014 నుండి రెండు ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుంది. 119 సీట్లలో 38 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోవటం అంటే చిన్న విషయం కాదు. మొత్తం సీట్లలో బీజేపీకి వచ్చింది కేవలం 8 అంటే 8 సీట్లు మాత్రమే.
8 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ, 38 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ను ఔట్ డేటెడ్ పార్టీ అనటమే ఆశ్చర్యంగా ఉంది. 38 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ నిజంగానే ఔట్ డేటెడ్ పార్టీ అయితే మరి 8 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఏమిటి ? కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీలు కలిసిపోతాయని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో వాస్తవం ఎంతుందో ఎవరికీ తెలీదు. ప్రచారమైతే విపరీతంగా జరుగుతోంది. ఈ ప్రచారం నేపధ్యంలోనే బీఆర్ఎస్ తో తమ పార్టీ చర్చలు జరిపే అవకాశమే లేదని బండి అన్నారు. అయితే ఇంతటితో ఆగని బండి కారుపార్టీని ఔట్ డేటెడ్ పార్టీ అని వర్ణించటమే విచిత్రం. తన ఎంఎల్ఏలను కాపాడుకునేందుకే బీజేపీలో విలీనమని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని బండి ఎద్దేవా చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. అసలు కారుపార్టీలో ఏముందని తమ పార్టీలో విలీనం చేసుకోవాలని బండి ఎదురు ప్రశ్నించారు. బీఆర్ఎస్ గెలిచిన 38 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికి 10 మంది పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిపోయారు. అంటే ఇంకా 28 మంది ఎంఎల్ఏలు కారుపార్టీతోనే ప్రయాణం చేస్తున్నారన్న విషయాన్ని బండి మరచిపోయినట్లున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కారుపార్టీయే ప్రధాన ప్రతిపక్షం. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయినా ఆ హోదా బీజేపీకి అయితే రాదన్నది వాస్తవం. 12 మంది ఎంఎల్ఏలు ఉంటేకాని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. మరి బీజేపీకి ఉన్న 8మంది ఎంఎల్ఏలతో సాధ్యంకాదు కదా. కేసీఆర్ అంటే ఉన్న కోపంతోనే బండి ఏదేదో మాట్లాడేస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది.