మద్యం కేసులో ‘భారతీ సిమెంట్స్’ బాలాజీ అరెస్ట్
సిమెంట్ కు లిక్కర్ కు ఉన్న బాంధవ్యం ఏమిటి?;
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ పోలీస్ అధికారులు కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈయన ప్రస్తుతం భారతీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత డైరెక్టర్ గా ఉన్నారు. ఆడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. కంపెనీ లావాదేవీలు కూడా చూస్తుంటారు. జగన్ ప్రభుత్వంలో మద్యం డిస్టిలరీ వారితో మాట్లాడి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం నుంచి ఎక్కువ ధర చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నా యి.
ప్రభుత్వం చెల్లించిన మొత్తం నుంచి ముడుపులు తీసుకున్న నేరం కింద మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. గత ఆదివారం విచారణకు హాజరు కావాలని విజయవాడ సిట్ పోలీసులు నోటీస్ ఇచ్చినా స్పందించలేదు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. గోవిందప్ప మైసూరులో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రానికి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరు పరచనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం (Liquor case) సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో 33 మంది నిందితులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకున్న సిట్ పోలీసులు గత ప్రభుత్వంలో సీఎంవో కేంద్రంగా కీలకంగా వ్యవహరించిన ముగ్గరు వ్యక్తులను నిందితులుగా చేర్చింది.
వారిలో నాటి ముఖ్య మంత్రి జగన్ కార్యదర్శి కె ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి తరువాత వీరు ముగ్గరు ప్రధానమైన వ్యక్తులుగా పోలీసులు భావించారు. ఈ మేరకు వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నిందితులు ముగ్గురిలో ధనుంజయ్ రెడ్డి రిటైర్డ్ కాగా కృష్ణమోహన్ రెడ్డి గతంలోనే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నారు. వీరిని విచారించేంకు నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడంతో ఇటీవల వీరికి సన్నిహితులైన సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ్ రెడ్డి, జగన్ పీఏ కె నాగేశ్వరెడ్డి ఇండ్లలోనూ సిట్ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిందితులు ముగ్గురూ హైదరాబాద్, తాడేపల్లిల్లో మద్యం డిస్టిలరీ కంపెనీల వారితో పలు మార్లు చర్చలు జరిపి వారి నుంచి ఎంత పర్సెంటేజీ తీసుకోవాలనే విషయాలు మాట్లాడారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గాలింపులో భాగంగా బాలాజీ గోవిందప్ప మైసూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.
గోవిందప్ప మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, సూట్ కేస్ కంపెనీలకు నిధులు మల్లించి వైట్ గా తిరిగి అనుకున్న వారికి చేర్చడంలో గోవిందప్ప సిద్ధహస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఈయన ఆడిటర్ కూడా కావడంతో ఈ వ్యవహారాలన్నీ చక్కబెటిట్లు పోలీసులు భావిస్తున్నారు. గోవిందప్పను మంగళవారం సాయంత్రానికి విజయవాడ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది.