బాబు-పవన్ సమన్వయం.. పార్టీ నేతలది మరోదారి..?!

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో ఆ పార్టీ శ్రేణుల తీరు విరుద్ధంగా మారింది. షాడో ఎమ్మెల్యేల పెత్తనం కూటమిని దెబ్బతీయనుందా?

Update: 2024-07-02 14:19 GMT

"రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి, సంక్షేమం సవ్యంగా సాగుతుంది"

2024 మే 8వ తేదీ చిత్తూరు జిల్లా కలికిరి వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ అలా ఆకాంక్షించిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.
ప్రభుత్వంలోని రెండు పార్టీ సారధులు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ సమన్వయంతో సాగుతున్నారు. పాలనను ప్రజల చెంతకు చేర్చడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అవసరమైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అనేక రకాలుగా ఆలోచనలు సాగిస్తున్నారనే విషయం వారి వ్యవహార తీరు, మాటలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్ధాయిలో ఆ రెండు పార్టీల నేతలు అనుసరిస్తున్న విధానాలు టీడీపీ జనసేనకు కొత్తకష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. "ఎన్నికల్లో కలసి పనిచేశాం. పడిన కష్టానికి ఫలితంగా అధికారంలోకి వచ్చాం. ఇక మా ఇష్టం మాదే" అనే రీతిలో సాగుతున్నారు. రోజుల వ్యవధిలోనే అపప్రద మూటగట్టుకునే పరిస్థితులకు కారణం అవుతున్నట్లు కనిసిస్తోంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఆలోచనా విధానాన్నిదగ్గరగా పరిశీలిస్తే, ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులను అంచనాలు వేయడంలో తలమునకలుగా ఉన్నారు. అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేయడానికి వీలుగా వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఎన్. చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో.. "పోలవరం జాతీయ ప్రాజెక్టు పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు" ఇదిలావుంటే...

క్షేత్రస్థాయిలో రివర్స్
కూటిమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ గా పనిచేస్తున్న సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఆదర్శాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకముందే, కూటమి పార్టీల మధ్య ఎన్నికల నాటి సమన్వయం, సహకారం కొరవడినట్లు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ఎవరికి తోచిన తీరుగా వారు వ్యవహరిస్తుండడం, టిడిపి ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన, బీజేపీ నేతలు దూరంగా ఉండడం. ఎమ్మెల్యేల కుటుంబీకుల పెత్తనం, షాడో ఎమ్మెల్యేలుగా మారి, కూటమి స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుడే ఈ వ్యవహారాలపై జనంలో చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా,
రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉండగా, వైఎస్ఆర్సిపి ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. జనసేన చిత్తూరు జిల్లా తిరుపతి, కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందారు. బీజేపీనుంచి కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా ధర్మవరం, కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగతా 40 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది.
అధికారంలోకి వచ్చాం కదా! ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని రీతిలో.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం తీసుకొని రీతిలో వ్యవహరిస్తున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యవహారం బాహాటంగా బట్టబయలైంది.
ఎవరి దారి వారిది
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమష్టిగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సాధారణంగా జరిగేదే. ఎన్నికల ప్రచార సమయంలో సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని కూటమి సారథులు ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ మొదటి కార్యక్రమాన్ని పండుగల నిర్వహించారు. ఇందులో మెజారిటీ ప్రాంతాలలో డబుల్ ఇంజన్ పార్టీల్లోని టిడిపి జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, జిల్లా, రీజియన్స్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించే వారు కూడా కలసి రాకపోగా, పాత రాజకీయ మనస్పర్ధలు నేపథ్యంలో తటస్థంగా ఉంటున్నారని పరిస్థితి చెబుతోంది.


 షాడో ఎమ్మెల్యేలు..
కూటమిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి కుటుంబీకులు కొందరు షాడో ఎమ్మెల్యేలుగా మారారు. ఇది కూటమి ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు లా మారే పరిస్థితి కనిపిస్తోంది. అందులో ప్రధానంగా, ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో చెరగని స్థానం ఉన్న తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. మితభాషి సున్నితంగా ఉండే ఆయన కూటమి అధినేతలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ స్థానిక నాయకులను మాజీ ఎమ్మెల్యేను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోదరుని కుమారుడు అరణి శివకుమార్..
" తిరుపతి నగరపాల సంస్థ కమిషనర్ అతిథి సింగ్, అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు"
ఈ వ్యవహారం తిరుపతిలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో చర్చకు ఆస్కారం కల్పించింది. "దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా, తిరుపతిలో మాత్రం ఆ స్వేచ్ఛ లేకుండా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. మీరందరూ కలిసి దృష్టి పెట్టి, మనసుపెట్టి పని చేస్తేనే మాకు మంచి పేరు వస్తుంది. ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే కావడం అందరూ స్వాగతిస్తున్నారు సంతోషంగా ఉన్నారు. మీ అందరికీ స్వేచ్ఛ ఇస్తాం. అందరినీ సమానంగా గౌరవిస్తాం. పనులు మా దృష్టికి ఒకసారి తీసుకువచ్చి ప్రజలకు అవసరమైనవి చేయండి. దేవుడు ఆశీస్సులు వల్లే తిరుపతి ఎమ్మెల్యే గా రాగలిగాం. ఎమ్మెల్యే గారితో కలిసి అందరం మళ్లీ చర్చించుకుందాం" అని ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు శివ కుమార్ సమీక్ష నిర్వహించడం పై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా..
కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరిత రెండు రోజుల క్రితం చిన్నమండెం మండల ఎస్సైని మందలించిన తీరు కూడా వివాదాస్పదమైంది. దీనిపై సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు స్పందించడం వంటి చర్యల నేపథ్యంలో విపక్ష వైయస్ఆర్సీపీకి అస్త్రం అందించినట్లుగా భావిస్తున్నారు.
ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావనార్హం. ఈ తరహా చర్యల వల్ల డబల్ ఇంజన్ నేతల రాష్ట్ర పరిస్థితి సరిదిద్దే వ్యవహారాలకు ప్రతిబంధకం కాగలదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొరవడిన సమన్వయం..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన పింఛన్ల పంపిణీ మొదటి పండుగ ద్వారా దీర్ఘకాలికంగా నాయకుల మధ్య ఉన్న విభేదాలు వైరుధ్యం బహిర్గతమైంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ గా ఉన్న నేతతో పాటు మాజీ ఎమ్మెల్యే వారి అనుచర వర్గీయులు ఎవరు దరిదాపుల్లోకి రావడం లేదు. బిజెపి నాయకులు కూడా టిడిపి ఎమ్మెల్యే షాజహాన్ తో అంతే దూరం పాటిస్తున్నారు. ఇక్కడ అధినేతలు జోక్యం చేసుకున్నా సరే ఎన్నికల సమయంలో మాదిరి సమన్వయం కుదరలేదు. ఇది కాస్త మూడు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.


ఇన్చార్జ్ కుటుంబీకులదే పెత్తనం
కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉత్సవ విగ్రహంగా మారారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ప్రతి ప్రారంభోత్సవంలో ఈయనను తెరపైకి తీసుకు వచ్చిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన కుటుంబీకులే పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. ఆయన సతీమణి వరలక్ష్మి కార్యక్రమాల్లో ప్రధానంగా ఉంటున్నారు. కాగా,  మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు, సీనియర్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుతోపాటు పార్టీ శ్రేణుల మధ్య కూడా సమన్వయం కొరవడినట్లు చెబుతున్నారు.
రాజంపేట అసెంబ్లీ స్థానంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అందుబాటులో లేకపోవడం, ఓటమి చెందిన సుగువాసి బాలసుబ్రమణ్యం సరిగా స్పందించకపోవడం వంటి పరిస్థితిలో నేపథ్యంలో మూడో పార్టీల శ్రేణులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలా నిలిచింది. వాస్తవానికి ఈ జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి బలమైన కేడర్ ఉంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలను కూడా టిడిపిని కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో జనసేన ప్రభావం నామమాత్రం. బీజేపీది కూడా దాదాపు అదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులు.. జనసేన శ్రేణులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి గెలుపొందారు. ఇక్కడ మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు స్థానాల మాత్రం వైఎస్ఆర్సిపి గెలుచుకుంది. అయినప్పటికీ పార్టీ శ్రేణుల మధ్య కొంత మేరకు సమన్వయం ఆశాజనకంగానే ఉన్నట్లు భావిస్తున్నారు.
విధ్వంస రచన
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే, అనుమతులు లేవనే కారణంగా, అమరావతి సమీపంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయ భవనాలను పూల దోచిన వ్యవహారం తెలిసిందే. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న టీడీపీ జనసేన పార్టీ నాయకులు గ్రామాల్లో సైతం అదే పంథా అనుసరించారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన రోడ్ల వివరాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడంపై స్థానికుల నుంచి నిరసనలు కూడా వినిపించాయి.
సెంటిమెంట్ కు తిలోదకం...
ప్రధానంగా హిందువులకు సెంటిమెంట్ ఉంటుంది. దేవుళ్ళ ప్రతిమలు లేదా పేర్లు ఉండే కలకాలం ధ్వంసం చేయడానికి వెనుకంజ వేస్తారు. " తిరుపతిలో రోడ్ల నిర్మాణాల పూర్తయిన ప్రదేశాల్లో టీటీడీ స్వాగత్వ తోరణంగా చెక్కిన శిలాఫలకాలను జనసేన నాయకులు ధ్వంసం చేశారు" ఇది కాస్త స్థానిక ప్రజల సెంటిమెంట్ పై ప్రభావం చూపించింది. అదే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా కనిపించింది. తిరుపతి ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలువైన చంద్రగిరి, శ్రీకాళహస్తి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి కొలువైన ప్రాంతాల్లో శిలాఫలకాలపై ఆ దేవతామూర్తులను ప్రతినిమించే ఆర్చులను చిత్రీకరించడం ఆనవాయితీ. వాటిని కూడా పట్టించుకోకుండా ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా మూడు పార్టీల మధ్య సమన్వయం లోపించింది అనే విషయం రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. నామినేటెడ్ పదవుల పందారం తర్వాత ఇంకెన్ని చిత్రాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News