సీజేఐపై దాడి తీవ్రంగా పరిగణించాలి- వెంకయ్య

పార్టీ మారిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి,రాజ్యాంగంలో మార్పులు చేయాలన్న మాజీ ఉప రాష్ట్రపతి

Update: 2025-10-07 10:21 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌పై బూటుతో దాడియత్నం ఘటనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్‌కి సంబంధిచిన వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి, వ్యవస్థకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు పర్యటనలో వున్న వెంకయ్యనాయుడు పలు అంశాలపై స్పందించారు.
పార్టీ మారితే రాజీనామా చేయాలి
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదిశగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తమ పార్టీ అధికారం లోకి రాకపోతే అధికారం లోకి వచ్చిన పార్టీలో చేరి కొందరు మంత్రులుగా కూడా అవడం ఆందోళన కల్గించే అంశంగా పరిగణించాలన్నారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించకూడదని హితవు పలికారు.
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు మితిమీరి హామీలు గుప్పిస్తున్నాయని, ప్రజలకు అందించే ఉచిత పథకాలు పరిధి దాటుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. ఇలాంటి పథకాల కోసం ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని అన్నారు. ఆయా ప్రభుత్వాలు అప్పులు తీసుకువచ్చేటప్పుడు వాటిని ఎలా తీరుస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని, ఇందుకోసం అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.రాజకీయాలలో నైతిక విలువలు దిగజారకూడదని కూడా పార్టీలకు సూచించారు.అలా జరిగితే ప్రజలలో విశ్వాసం కొల్పోతారన్నారు.
Tags:    

Similar News