సిరిమాను సంబరంతో మురిసిన విజయనగరం

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకను కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయింది.

Update: 2025-10-07 14:00 GMT
విజయనగరం వీధుల్లో సిరిమాను ఉత్సవం

ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయంలో భాగంగా మంగళవారం పైడితల్లి సిరిమానోత్సవం విజయనగరం పురవీధుల్లో అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి పట్టణంలో అమ్మవారి సిరిమాను ఊరేగింపు మొదలైంది. అది సాయంత్రం చీకటి పడే వరకు కొనసాగింది. ఈ సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగున ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీసగఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు.

ఈ ఏడాది దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరైనట్టు అంచనా. ఈ ఏడాది సిరిమానును వంశపారంపర్య పూజారి బంటుపల్లి వెంకట్రావు అధిరోహించారు. విజయనగరం వీధుల్లో సిరిమాను ఊరేగుతుండగా, పట్టణ వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా అనుసరించారు. ఇళ్లలో ఉన్న వారు పైడితల్లి అమ్మవారిగా భావించే సిరిమానుకు నమస్కరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. విజయనగరంలో 120 సీసీ కెమెరాలను, 20 డ్రోన్లను ఏర్పాటు చేశారు. 2600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.


విజయనగరం పురవీధుల్లో భక్తజన సందోహం

గుడికి ప్రదక్షిణతో ఆరంభమై..

సిరిమానోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా 33 మూరల పొడవుండే సిరిమాను కోసం గాలించి తెస్తారు. ఈ ఏడాది కూడా అలాగే తెచ్చారు. ఆచారం ప్రకారం పొడవైన గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో ప్రధాన పూజారి కూర్చుని గుడికి ప్రదక్షిణ చేయడంతో ఉత్సవం ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది రసవత్తర సన్నివేశాలను పూర్తి చేశారు. పూజారి తన చేతిలో విసనకర్రను విసురుకుంటూ, భక్తులకు అరటిపండ్లను విసిరారు. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు (ఏనుగు ఆకారంలో ఉండే బండి), అంజలి రథంలను చూడడానికి భక్తులు ఎగబడ్డారు.

ఆసక్తికరమైన ఆనవాయితీ..

మరోవైపు చెరువు గర్భం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీయడంలో స్థానిక జాలర్లు పాలుపంచుకోవడంతో సిరిమాను రథం ముందు వీరు వలతో, వారి వెంట ఈటెలతో జనం నడిచే ఆనవాయితీని కొనసాగించారు. ‘తెల్ల ఏనుగు’పై పైడితల్లి అక్కచెల్లెళ్లు, ఏకైక సోదరుడు పోతురాజు రూపంలో ఉన్న వారిని ఉంచారు. సిరిమాను సంబరంలో ఆఖరిదైన అంజలి రథం అమ్మవారి వైభవానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రథంపై ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించే పరిచారికల వేషధారణలో ఉంచారు. వీరు సిరిమాను ముందు అమ్మవారిని సేవిస్తూ కనిపించారు. ఇలా బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం నడుస్తుండగా వివిధ వేషధారులు భక్తిపారవశ్యంతో కదం తొక్కారు.


సిరిమానుపై పూజారి (ఇన్‌సెట్‌)

చెరువులో ఉద్భవించిన పైడితల్లి..

పైడి తల్లి అమ్మవారి ఆత్మకథ ప్రకారం.. విజయనగరం మహారాజ వంశీయులు పూసపాటి పెద విజయ రామరాజు సోదరి ఈ పైడితల్లి. బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న ఆమె దేవీ ఉపాసకురాలు కూడా. పొరుగు రాజ్యం బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతకు గురి చేసింది. ఆమె యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేసినా అన్న వినకుండా 1757లో బొబ్బిలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే ఆ యుద్ధంలో బొబ్బిలి రాజుల (వెలమలు) చేతిలో విజయ రామరాజు ఓడిపోయాడు. ఆరోజు రాత్రి పైడితల్లి కలలో దేవి కనిపించి అన్న ప్రాణాలకు ముప్పును ముందే హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలస్వామినాయుడు, మరికొందరు అనుచరులతో బొబ్బిలి బయల్దేరింది. కొద్దిదూరం వెళ్లాక ఆమె ఆపస్మారక స్థితికి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువులో ఉందని, దాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు, ఉత్సవాలు జరపమని చెప్పి పైడితల్లి దేవిలో ఐక్యమైంది. అప్పట్నుంచి ఆమె పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయింది.

268 ఏళ్లుగా పూజలందుకుంటున్న అమ్మవారు..

268 ఏళ్ల క్రితం… 1757లో విజయ దశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని అప్పలస్వామినాయుడు వెలికి తీశాడు. అనంతరం మూడు లాంతర్ల జంక్షన్లో ఆలయ ప్రతిష్ట జరిగింది. ఆయనే అమ్మవారికి తొలి పూజారి. అప్పట్నుంచి ఆ కుటుంబీకులే వంశపారంపర్యంగా పూజారులుగా ఉండడం, సిరిమానును అధిరోహించడం ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News