ఆంధ్రా ‘మహాలక్ష్మి'కి ఇప్పట్లో మోక్షం లేనట్టే!

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం భారమౌతుందంటున్న ఆర్టీసీ

Update: 2024-12-24 10:00 GMT

అధికారంలోకి రాకముందు కూటమి నేతలు ఓట్లు దండుకోవడానికి సూపర్ సిక్స్ పేరిట ఆరు ప్రజాకర్షక హామీలను గుప్పించారు. అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు హామీల్లో మహిళలను బాగా ఆకట్టుకున్న పథకం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ వయసుతోను, దూరంతోను నిమిత్తం లేకుండా రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించవచ్చన్న మాట! దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తాము ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరిగేస్తామని సంబరపడ్డారు.

పొరుగున ఉన్న కర్నాటక, తెలంగాణల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ ఫ్రీ బస్సు పథకం తమకూ అందుబాటులోకి వచ్చేస్తుందని ఆంధ్ర 'మహాల క్ష్మి'లు ఉవ్విళ్లూరారు. కొంతమంది మహిళలు.. ఏఏ బస్సుల్లో తమను అనుమతిస్తారు? ఎక్కడెక్కడకు వెళ్లాలి? ఏ తీర్థయాత్రలకు పయనమవ్వాలి? వంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు కూడా. జూన్లో కూటమి ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక ఇక ఎప్పుడు ఫ్రీగా ఆర్టీసీ బస్సెక్కెద్దామా? అంటూ ఆంధ్రప్రదేశ్లోని అతివలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కూటమి సర్కారు అధికారాన్ని చేపట్టి ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ ఉచిత బస్సు పథకంపై మీనమేషాలే లెక్కిస్తోంది. రోజుకో ముచ్చటతో కాలం వెళ్లబుచ్చుతోంది. అధికారంలోకి రావడానికి ముందూ వెనకలు ఆలోచించకుండా ఇచ్చిన ఫ్రీ బస్సు హామీ ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండలా పరిణమించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీల్లో ఒకట్రెండు అమలుకు శ్రీకారం చుట్టినా ఉచిత బస్సుపై మాత్రం అడుగు ముందు పడడం లేదు. ఈ పథకంపై సమగ్ర అధ్యయనం చేశాక స్పష్టతనిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

 

ఆర్టీసీ అధికారుల అంచనాలివీ..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఆర్టీసీ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఆర్టీసీకి 11,678 బస్సులున్నాయి. వీటిలో 8,964 ఆర్టీసీ సొంత బస్సులు, 2,714 అద్దె బస్సులు. రోజుకు ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 44 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో పాస్ హోల్డర్లు పోను 27 లక్షల మంది టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఏసీ బస్సుల్లో మూడు లక్షల మంది, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో 24 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఈ పథకం అమలు చేస్తే ఈ సర్వీసుల్లో రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు.

మరోవైపు ప్రతిరోజూ ప్రయాణించే వారిలో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మహిళలు ఉంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైతే మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 69 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 95 శాతానికి చేరుతుందని, అందువల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య సరిపోనందున అదనంగా వివిధ రకాల బస్సులు మరో రెండు వేలు అవసరమవుతాయని తేల్చారు.

బస్సుల సంఖ్యతో పాటు ఆర్టీసీ సిబ్బందినీ పెంచాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 47,803 మంది ఉద్యోగులున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే రెండు వేల బస్సులకు అదనంగా మరో 11,500 మందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఐదు వేల మంది డ్రైవర్లు, ఐదు వేల మంది కండక్టర్లు, 1,500 మంది వరకు మెకానిక్లు, ఇతర సిబ్బంది అవసరమవుతారని తేల్చారు.

 

‘ఉచిత' భారం నెలకు రూ.200 కోట్లు..

ఆర్టీసీకి ప్రస్తుతం ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.16 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇందులో మహిళా ప్రయాణికుల నుంచి రూ.6-7 కోట్లు వస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే ఈ రూ.6-7 కోట్లను నష్టపోవలసి వస్తుంది. ఈ లెక్కన ఆర్టీసీ నెలకు దాదాపు రూ.200 కోట్ల వరకు కోల్పోవలసి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే భారీ నష్టాల్లో ఉంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆర్టీసీ రూ.1,566 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఉచిత భారం నెలకు మరో రూ.200 కోట్లు తోడవుతుంది. ఇలా ప్రస్తుత నష్టాలకు ఏడాది కాలంలో రూ.2,400 కోట్ల చొప్పున పెరుగుతూ పోతుంది. అందుకే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని సాధ్యమైనంత కాలం ఏదో వంకతో సాగదీయాలన్న కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ అధికారుల నివేదికను అందుకున్న ప్రభుత్వం.. ఇటీవల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎం.రాంప్రసాదొడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి వస్తుంది. ఆ తర్వాత ఉప సంఘం ఇచ్చే నివేదికను, ఇప్పటికే ఆర్టీసీ అధికారులు సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి మరికొంత కాలం పడుతుంది. అందువల్ల గతంలో చెప్పినట్టుగా ఈ సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఉచితం అమలైతే మళ్లీ చార్జీల బాదుడే!

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధఃపాతాళంలో ఉంది. ఈ సంక్షోభ స్థితిలో ఆర్టీసీ నష్టాలను భరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తే ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఆ బాదుడును ఇతర ప్రయాణికులు భరించాల్సి వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News