కర్నూలులో కృత్రిమ వరదలు–రైతులకు తీవ్ర ఇబ్బందులు

కర్నూలు జలవనరుల శాఖ ఛీఫ్‌ ఇంజనీర్‌కి విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి.;

Update: 2025-09-12 13:37 GMT

కర్నూలులో కృత్రిమ వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుందూ నదిలో కృత్రిమ వరదల కారణంగా నంద్యాల, కడప జిల్లాలలో పంట పొలాలు మునిగిపోతున్నాయని తద్వారా రైతులు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఆ మేరకు కర్నూలు జిల్లా జలవనరుల శాఖ ఛీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ భాషకు విజ్ఞప్తి చేశారు. సమితి కార్యదర్శి మహేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా జలసాధన సమితి నాయకులు శేషాద్రిరెడ్డి రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు అరుణ్‌ లతో కలిసి శుక్రవారం కర్నూలు జిల్లా జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ భాషాకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు నిప్పుల వాగు, గాలేరు నదుల ద్వారా కృష్ణా జలాలను అధికంగా కుందూ నదిలోకి విడుదల చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఛీఫ్‌ ఇంజనీర్‌ కు వివరించారు. రైతు నాయకుల విజ్ఞప్తికి స్పందించిన సీఈ ఇకపై కుందూ నదిలోకి కృష్ణా జలాల విడుదలను 7,000 క్యూసెక్కులకు పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఎస్‌ఆర్బీసీ ప్రధాన కాలువలో అధిక జలాల విడుదల వలన పంట పొలాలు మునిగిపోతున్న అంశాన్ని కూడా నాయకులు ఛీఫ్‌ ఇంజనీర్‌ దృష్టికి తీసుకురావడంతో, సీఈ ఈ కాలువలో నీటి విడుదలను 10,000 క్యూసెక్కులకు పరిమితం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కుందూ నదిలోకి కృష్ణా జలాలను తగ్గిస్తామని సానుకూలంగా స్పందించడం పట్ల బొజ్జా ఛీఫ్‌ ఇంజనీర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Tags:    

Similar News