‘మా మందు బాగుందా? కిక్ ఇస్తున్నదా?’

జగన్ కాలం కల్తీ మందు ఆరోపణల నేపథ్యంలో కూటమి మందు పై మద్యం ప్రియుల నుంచి అభిప్రాయ సేకరణ.;

Update: 2025-05-16 02:30 GMT
వైజాగ్‌లో ఓ వైన్‌ షాపు

పరిపాలన ఎలా ఉంది? అని ప్రజలను అడగాల్సిన ప్రభుత్వం.. మేమిస్తున్న మందు (మద్యం) ఎలా ఉందని అడుగుతోంది. తాము అందిస్తున్న పరిపాలనపై ప్రజల అభిప్రాయం తీసుకుని వారి మనోభావాలకు అనుగుణంగా పాలనలో మార్పులు తీసుకురావడం, తప్పొప్పులను సరి చేసుకోవడం ప్రభుత్వాలు చేయాల్సిన పని. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు.. పాలనకంటే మద్యం పైనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నట్టు అనిపిస్తోంది. మేం మంచి మద్యాన్నే ఇస్తున్నామా? అని మందుబాబులను అడుగుతోంది. దీన్నిబట్టి లిక్కర్‌ను కూడా సేవా రంగంలోకి తెచ్చేసినట్టుంది కూటమి సర్కారు తీరు.

ఆంధ్రలోని కూటమి ప్రభుత్వం ఇతరత్రా సమస్యలు, ప్రజల అవసరాలకంటే మందుకే ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఏవేవో బ్రాండ్ల పేరుతో నాణ్యత లేని లిక్కర్‌ను విక్రయించి మద్యం ప్రియుల ఆగ్రహాన్ని చవి చూసింది. ఆ ఐదేళ్లలో చీప్‌ లిక్కర్‌ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నామన్న భావన వీరిలో బలంగా నాటుకు పోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి జగన్‌ ప్రభుత్వం అమ్మకాలు చేపట్టిన చీప్‌ లిక్కర్‌ కూడా ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలయ్యాయి. నాణ్యత లేని ఈ చీప్‌ లిక్కర్‌ తాగడం వల్ల పేద, దిగువ మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయంటూ ఊదరగొట్టాయి. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్నే అందుబాటులో ఉంచుతామని కూటమి పార్టీలు చెప్పుకొచ్చాయి. దీంతో మెజార్టీ మందుబాబులు కూటమికే ఓటేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలనలో ఉన్న సర్కారీ మద్యానికి మంగళం పాడింది. వేలం పాటల ద్వారా బ్రాందీ షాపులను అందుబాటులోకి తెచ్చింది. ఇక అన్ని మద్యం షాపుల్లోనూ నాణ్యమైన లిక్కరునే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే మద్యం ధరలను కంటి తుడుపుగా తగ్గించింది. క్వార్టరు బాటిల్‌పై రూ.10–15 వరకు తక్కువకు అమ్మకాలు జరిపేలా చూస్తోంది. అయితే ఆయా బ్రాందీ షాపుల్లో అమ్మే మద్యం బ్రాండ్లు మారాయే తప్ప లిక్కరు నాణ్యత మాత్రం ఏమంత మెరుగు పడలేదని మందుబాబులు చెబుతున్నారు. రాష్ట్రంలో 3,396 మద్యం షాపులు, 1,857 బార్లు ఉన్నాయి.

                                            విశాఖలో ఓ వైన్‌ షాపులో ఏర్పాటు చేసిన క్యూ ఆర్‌ కోడ్‌

మందు నాణ్యతపై క్యూ ఆర్‌ కోడ్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో విక్రయిస్తున్న లిక్కర్‌ నాణ్యతపై కూటమి సర్కార్‌ సరికొత్తగా ఆరా తీస్తోంది. గతంలో ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా దీనిపై సమాచారం సేకరించేది. తాజాగా మద్యం నాణ్యతతో పాటు ధరలు, ఎమ్మార్పీ ఉల్లంఘన తదితర అంశాలపై మందుబాబుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇందుకోసం మద్యం షాపులు, బార్ల కౌంటర్‌ వద్ద మందుప్రియులు తమ అభిప్రాయాలు తెలిపేందుకు వీలుగా క్యూ ఆర్‌ కోడ్‌లను ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఏర్పాటు చేసింది. ఇలా షాపును బట్టి 2 నుంచి 5 వరకు వీటిని అందుబాటులో ఉంచింది. లిక్కర్‌ నాణ్యతపై మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవచ్చని, అందులో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చని లిక్కర్‌ కొనుగోలుదార్లకు సూచించాలని ఎక్సైజ్‌ అధికారులు వైన్‌ షాపు నిర్వాహకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పడు మద్యం షాపుల నిర్వాహకులు/సిబ్బంది తమ దుకాణం వద్దకు లిక్కరు కొనుగోలుకు వచ్చే వారికి క్యూ ఆర్‌ కోడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై ఇంకా చాలామందికి అవగాహన లేక ఈ క్యూ ఆర్‌ కోడ్‌ స్కానర్ల జోలికి అంతగా వెళ్లడం లేదు. వైన్‌ షాపుల వద్ద క్యూ ఆర్‌ కోడ్‌లో ఐదు ప్రశ్నలు, బార్లలో మూడు ప్రశ్నలు చొప్పున ఇచ్చారు.
మందు బాబులు ఏం చేయాలంటే?
మద్యం షాపుల వద్ద ఏర్పాటు చేసిన క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే .. ఐదు ప్రశ్నలు మొబైల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కనిపిస్తాయి. వాటిలో 1. గతంతో పోలిస్తే మద్యం నాణ్యత పెరిగిందా? 2. పాపులర్‌ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయా? 3. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తగ్గాయా? 4. మీ ప్రాంతంలోని దుకాణాల్లో ఎమ్మర్పీ ఉల్లంఘనలు గమనించారా? 5. దుకాణ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? అనే ప్రశ్నలుంటాయి. వీటికి దిగువన అవును/కాదు అనే ఆప్షన్లుంటాయి. వాటిని ఎంపిక చేశాక పేరు, మొబైల్‌ నంబరు, నియోజకవర్గం, జెండర్, పుట్టిన తేది సమర్పించి సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ బార్ల విషయంలో ధర, ఎమ్మర్పీ ఉల్లంఘనల ప్రశ్నలు ఉండవు.
లిక్కర్‌ నాణ్యతపై పెదవి విరుపు..
లిక్కర్‌ నాణ్యతపై మద్యం ప్రియులు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్‌ దొరుకుతుందని భావించామని పేద, మధ్య తరగతి మందుబాబులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో చీప్‌ లిక్కర్‌ అందుబాటులో ఉంచేవారని, అయినా మందుకు అలవాటు పడి విధిలేక దానినే తాగి ఆరోగ్యం పాడు చేసుకునే వారమని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారుతుందని ఆశించామని అంటున్నారు. కానీ క్వార్టరు బాటిల్‌ వద్ద రూ.10–15 ధర తగ్గడం, బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో ఉండడం మినహా నాణ్యత ఏమంత మెరుగ్గా లేదంటున్నారు. ప్రస్తుతం షాపుల్లో దొరికే మద్యంలో బ్రాండ్ల పేర్లు మార్పే తప్ప నాణ్యతలో పెద్దగా తేడా లేదని విశాఖ అక్కయ్యపాలేనికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కేసిన అప్పలనాయుడు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పాడు. కూటమి పెబుత్తం వొచ్చేక కోటరు బోటిల్‌ దగ్గర పదో ఇరవై తగ్గించి అమ్ముతున్నారు. రుచి మెరుగవనేదు.. కాకపోతే డబ్బున్నోడికి కావల్సిన సరుకు (బ్రాండ్‌) దొరుకుతాంది’ అని విజయనగరం నుంచి పోర్టులో లేబర్‌ పనికి వచ్చిన అరిగట్ల సోమేష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మద్యం క్వాలిటీపై ప్రభుత్వం క్యూ ఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకురావడంపై షిప్‌యార్డు రిటైర్డ్‌ ఉద్యోగి పి.నాగేశ్వరరావు ఏమన్నారంటే.. ‘దీని వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. లిక్కర్‌ షాపుల్లో విక్రయించే మద్యం ఏపాటి నాణ్యత ఉందో తాగినోళ్లే చెప్పాలా? ప్రభుత్వానికి తెలియదా? తెలుసుకునే యంత్రాంగం లేదా? ఇదంతా గత ప్రభుత్వంకంటే క్వాలిటీ మద్యాన్నే అమ్ముతున్నామని చెప్పే ప్రయత్నమే’ అని అభిప్రాయపడ్డారు.
దుకాణదార్లలోనూ అయిష్టత!
క్యూ ఆర్‌ కోడ్‌ విధానంపై మెజార్టీ దుకాణదారుల్లో అయిష్టతే కనిపిస్తోంది. ఎందుకంటే? వీరు విక్రయించే మద్యంలో మెరుగైన నాణ్యత లేదన్న విషయం వీరికి తెలియనిది కాదు. అందువల్ల ఎవరైనా ఇదేమిటని క్యూ ఆర్‌ కోడ్‌ల గురించి అడిగితేనే వివరిస్తున్నారు. ఏరికోరి అడిగితే ‘ఈ క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి.. లిక్కర్‌ క్వాలిటీపై మీ అభిప్రాయం తెలియజేయండి’ అని ముక్తసరిగా చెబుతున్నారు. ఒకవేళ దీని గురించి చెప్పినా స్కాన్‌ చేసి అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు (అభిప్రాయాలు) చెప్పేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదని విశాఖ నగరంలోని ద్వారకనగర్‌లోని ఓ వైన్‌షాపు సేల్స్‌మ్యాన్‌ అరుణ్‌కుమార్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పాడు. రోజుకు లిక్కర్‌ కొనుగోలు చేయడానికి వచ్చే వారిలో ఐదు శాతం కూడా క్యూ ఆర్‌ కోడ్‌ జోలికి వెళ్లడం లేదని అన్నారాయన.
Tags:    

Similar News