Target AlluArjun|పుష్ప కేంద్రంగా రాజకీయ వివాదాలు పెరిగిపోతున్నాయా ?
ఆదివారం కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi sanjay) రంగంలోకి దూకేశారు. అల్లుఅర్జున్ కు మద్దతుగా బండి నిలబడ్డారు. త
రోజులు గడుస్తున్నకొద్దీ పుష్ప సినిమా కేంద్రంగా రాజకీయ వివాదాలు పెరిగిపోతున్నాయి. పుష్ప సినిమా(Pushpa Movie) విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో(Sandhya Theatre) జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోగా ఆమె కొడుకు కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై శనివారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అల్లుఅర్జున్ను టార్గెట్(Target AlluArjun) చేస్తు రేవంత్ రెడ్డి(Revanth) రెచ్చిపోయారు. థియేటర్లో ఘటన జరిగిన విధానం, ఘటన తర్వాత అల్లుఅర్జున్ వైఖరి తదితరాలను వివరించిన రేవంత్ ఓ రేంజిలో దుమ్ముదులిపేశారు. రేవంత్ తన ఫోకస్ మొత్తాన్ని అల్లుఅర్జున్ మీదే పెట్టడం తెలంగాణాలో సంచలనమైపోయింది. తనమీద రేవంత్ అసెంబ్లీలో విరుచుకుపడటంతో అదేరోజు రాత్రి అల్లుఅర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టారు. అసెంబ్లీలో తనపైన రేవంత్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు తప్పని చెప్పారు. తనను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని మండిపడ్డారు.
వీళ్ళిద్దరి వివాదం ఇలాగుండగానే ఆదివారం కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi sanjay) రంగంలోకి దూకేశారు. అల్లుఅర్జున్ కు మద్దతుగా బండి నిలబడ్డారు. తెలుగుసినీ ఇండస్త్రీ(Telugu CineIndustry)మీద రేవంత్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నట్లు కేంద్రమంత్రి మండిపడ్డారు. అల్లుఅర్జున్ వ్యక్తిత్వాన్ని హననంచేసేలా సీఎం వ్యాఖ్యలున్నట్లు రివర్సు ఎటాక్ చేశారు. థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించటం నిజంగా దురదృష్టకరమన్నారు. ముగిసిన వివాదాన్ని అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్(MIM MLA Akbaruddin) తో లేవనెత్తించి రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిదికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీఇండస్ట్రీని దెబ్బతీసేట్లుగా వ్యవహరిస్తోందని బండి ఆరోపించారు. విషాహారంతిని స్కూలుపిల్లలు చనిపోతున్న విషయాన్ని వదిలేసి రేవంత్ పుష్పసినిమాను పట్టుకోవటంలో అర్ధం ఏమిటని నిలదీశారు.
రేవంత్ ను బండి టార్గెట్ చేయగానే, వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆదిశ్రీనివాస్, దేవరకద్ర నియోజకవర్గం కాగ్రెస్ ఎంఎల్ఏ మధుసూదనరెడ్డి సీన్ లోకి ఎంటరైపోయారు. బండిని, అల్లును ఇద్దరినీ కలిపి ఎంఎల్ఏలు వాయించేశారు. థియేటర్లో జరిగిన దుర్ఘటనను అల్లుఅర్జున్, బండి తక్కువచేసి మాట్లాడుతున్నట్లుగా మండిపోయారు. బాధితఫ్యామిలీని సినీఇండస్ట్రీ పెద్దలు ఎందుకు ఇప్పటివరకు కలవలేదని నిలదీశారు. జరిగిన తప్పును రేవంత్ అసెంబ్లీలో ఎత్తిచూపితే అల్లుఅర్జున్ బురదచల్లటం ఏమిటని ప్రశ్నించారు. తప్పుజరిగినపుడు తప్పును హుందాగా అంగీకరించాలని ఎంఎల్ఏ హితవు పలికారు. ఇదేసమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతు జరిగిన దుర్ఘటనలో అల్లుఅర్జున్ దే తప్పన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సినీఇండస్ట్రీపెద్దలు బాధితకుటుంబాన్ని ఎందుకు పరామర్శించటంలేదని నిలదీశారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని భవిష్యత్తులో ఏమిచేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు.
పోలీసులు అల్లుఅర్జున్ను అరెస్టుచేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తదితరులు తప్పుపట్టిన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ మీద కేసుపెట్టి అరెస్టుచేయటమే తప్పన్నట్లుగా బీఆర్ఎస్ కీలకనేతలు ప్రకటనలుచేయటమే విచిత్రంగా ఉంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో రేవంత్, బయట ఎంఎల్ఏలు ఆదిశ్రీనివాస్, మధుసూదనరెడ్డి ప్రస్తావించారు. మొత్తంమీద జరగుతున్నది ఏమిటంటే పుష్పసినిమా హీరో అల్లుఅర్జున్ కేంద్రంగా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు, కేంద్రమంత్రి బండి సంజయ్, మరోవైపు రేవంత్, ఎంఐఎం సభ్యుడు అక్బురుద్దీన్, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు మోహరించారు. చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.