పౌర విమానయాన రంగంలో తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు రానున్నాయా?

పౌర విమానయాన రంగంలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మంచి రోజులు రానున్నాయా అంటే అవునంటున్నారు పౌర విమానయానరంగం నిపుణులు.కొత్త విమానాశ్రయాలకు మోక్షం లభిస్తుందా?

Update: 2024-06-20 05:36 GMT

మన తెలుగు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కీలక శాఖ మంత్రి అయిన నేపథ్యంలో పెండింగులో ఉన్న విమానాశ్రయాల ప్రతిపాదనలకు మోక్షం లభించనున్నాయనే ఆశలు రేకెత్తాయి.

- జూన్ 12వతేదీ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.విమాన యానాన్ని సామాన్య పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.
- టైర్ -2, టైర్ -3 నగరాల్లోనూ కొత్త విమానాశ్రయాలను నిర్మించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని మంత్రి చెప్పారు.
- దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగులో ఉన్న విమానాశ్రయాల నిర్మాణానికి త్వరలో మోక్షం లభిస్తుందని తెలుగు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- తెలుగు ఎంపీ కీలక శాఖ మత్రి అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విమాన యాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాజీ కార్యదర్శి, ఏవియేషన్ రంగ నిపుణుడు, ఢిల్లీకి చెందిన నోముల శ్రీనివాస్ చెబుతున్నారు.

తెలంగాణలో కొత్తగా మూడు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడక్కల్‌ మండలం గుడిబండ గ్రామంలో మూడు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.తెలంగాణ ప్రభుత్వం మూడు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రయత్నిస్తుందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

 విమానం (ఫొటో : ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో)


 మరో మూడు విమానాశ్రయాలకు స్థలాలు..

వరంగల్ అర్బన్ జిల్లా మమ్మనూర్ గ్రామం,పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, ఆదిలాబాద్ లో ఇప్పటికే ఉన్న విమానాశ్రయ స్థలాల్లో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మొదటి దశలో వరంగల్, ఆదిలాబాద్‌లోని విమానాశ్రయాల పనులు ప్రారంభమైనట్లు వింగ్స్ ఇండియా 2024 సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ లో మంత్రి వెల్లడించారు.

నాగార్జున సాగర్ డ్యాం వద్ద వాటర్ ఏరోడ్రోమ్‌
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇదొక్కటే విమానాశ్రయం.రాష్ట్ర రాజధానికి ఆదిలాబాద్,నిజామాబాద్‌లు చాలా దూరంలో ఉండడంతో కొత్త విమానాశ్రయాలకు డిమాండ్ ఏర్పడింది.ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ డ్యాం వద్ద వాటర్ ఏరోడ్రోమ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ప్రాజెక్ట్ కోసం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించారు.

కేసీఆర్ హయాంలోనూ ప్రతిపాదనల్లోనే విమానాశ్రయాలు
బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు పాలనలో గత తెలంగాణ ప్రభుత్వం కూడా జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిని చేపట్టాలని ప్రతిపాదించింది.అదనంగా మమ్మనూర్, బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయాలను కూడా పునరుద్ధరించాలని వారు కోరారు.

ఎయిర్ పోర్ట్ అథారిటీ నివేదిక
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణలోని ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణం కోసం ఆరు సైట్‌లకు టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ, అడ్డంకి పరిమితి ఉపరితలాల సర్వే,సాయిల్ టెస్టింగ్, ఇతర పరీక్షలను నిర్వహించి,నివేదికను 2021 జూన్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.వరంగల్,ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి లో విమానాశ్రయాల ఏర్పాటు సాంకేతికంగా సాధ్యమయ్యేవిగా గుర్తించారు.

భూసేకరణ చేపట్టండి : ఎయిర్ పోర్ట్ అథారిటీ
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తక్షణమే భూసేకరణను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చిన్న విమానాల ప్రైవేట్ కార్యకలాపాల కోసం మూడు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ అభ్యర్థించింది.అసలు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ విమానాశ్రయాలు ఏటీఆర్-72 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనువైన దశ-1, ఏబీ-320 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఫేజ్-2తో దశలవారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

పదేళ్లుగా పెండింగులోనే...
గత 10 సంవత్సరాలుగా తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి చెందలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి,వరంగల్, రామగుండంలో విమానాశ్రయాలు అవసరమని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి వంటి ప్రాంతాలు విమానాశ్రయాల ఏర్పాటు అవసరం ఉన్నప్పటికీ, రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని విస్తరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది.

ఏపీలో ఆరు ఆపరేషనల్ విమానాశ్రయాలున్నా...తెలంగాణలో ఏకైక విమానాశ్రయం
తెలంగాణలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని జీఎంఆర్ విమానాశ్రయం అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఆపరేషనల్, మరో విమానాశ్రయం నిర్మాణంలో ఉన్నాయి. బేగంపేటలో విమానాశ్రయం, వరంగల్, రామగుండంలో ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లు అభివృద్ధికి అద్భుతమైన అవకాశం ఉందని ఏవియేషన్ నిపుణులే చెబుతున్నారు. ఈ విమానాశ్రయాలను పునరుజ్జీవింపజేయడం వల్ల విమాన ట్రాఫిక్‌ను వికేంద్రీకరించడంతోపాటు ఆర్థిక వృద్ధిని, యాక్సెసిబిలిటీని సాధించవచ్చు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పౌర విమానయాన రంగం తెలుగు ఎంపీ మంత్రి అయినందువల్ల అభివృద్ధి చేస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాజీ కార్యదర్శి, ఏవియేషన్ రంగ నిపుణుడు, ఢిల్లీకి చెందిన నోముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం,ఏవియేషన్ అకాడమీతో కూడిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు.భోగాపురం విమానాశ్రయం ఒక రన్‌వే, సమాంతర టాక్సీవే మరియు ప్రపంచంలోని అతిపెద్ద విమానాలకు సేవలందించే ఇతర మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం అవుతుంది.

నాలుగు గ్రీన్ ఫీల్గ్ విమానాశ్రయాలు
విశాఖపట్నం సమీపంలోని భోగాపురం (విజయనగరం జిల్లా)విమానాశ్రయంతో పాటు కుప్పం (చిత్తూరు జిల్లా), ఒరవకల్లు (కర్నూలు జిల్లా), దగదర్తి (శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా) వద్ద నాలుగు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి ఈ కార్పొరేషన్ ప్రతిపాదనలు సమర్పించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాజీ కార్యదర్శి, ఏవియేషన్ రంగ నిపుణుడు, ఢిల్లీకి చెందిన నోముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

దగదర్తి విమానాశ్రయం
నెల్లూరు జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. ప్రతిపాదిత విమానాశ్రయ స్థలం నెల్లూరుకు ఉత్తరంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గుంటూరు-చెన్నై హైవేకి పశ్చిమాన ఉంది.ప్రతిపాదిత వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండింటికీ ఈ విమానాశ్రయం నోడల్ పాయింట్‌గా ఉంటుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓడరేవులలో ఒకటైన కృష్ణపట్నం పోర్టుకు ప్రతిపాదిత విమానాశ్రయం సమీపంలో ఉంది. ప్రణాళికాబద్ధమైన ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ అయిన శ్రీ సిటీకి ఈ విమానాశ్రయం ప్రయోజనం చేకూరుర్చనుంది.

ఓర్వకల్‌లోని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
కర్నూలు జిల్లా ఓర్వకల్‌లోని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏపీఏడీసీఎల్‌ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. విమానాశ్రయం కర్నూలు నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది.వ్యవసాయం,తయారీ,సేవలరంగంలో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జిల్లా కర్నూలు. కర్నూలును ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌కు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాంతంలో సిమెంట్, స్టీల్, టెక్స్‌టైల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు కర్నూలు హబ్‌గా మారనుంది.

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు (ఫొటో క్రెడిట్: పీఐబీ)

విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం : కింజరాపు రామ్మోహన్ నాయుడు
భోగాపురం సహా ఏపీ రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధిలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమాన యాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు.సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు.టైర్ 2, టైర్ 3 నగరాల్లో విమానాశ్రయాలు నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి ప్రకటించారు. నిర్ణీత లక్ష్యం కంటే ముందే భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.


Tags:    

Similar News