విశాఖ ఉక్కు పక్కలో బల్లెం...
విశాఖ ఉక్కును వదలి మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద అంత ప్రేమ చూపడం అన్యాయం అంటున్న డా. ఇఎఎస్ శర్మ;

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎపుడైనా కభళించేలా పక్కనే మిట్టల్ స్టీల్ ( Arcelor-Mittal)కు అనుమతి నీయడం, ఈ విదేశీ సంస్థమీల వల్ల మాలిన ప్రేమను చూపుతూ అడిగివన్నీ కాదనకుండా కేంద్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టడం ఎంత నష్టమో చెబుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామికి మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ లేఖ రాశారు. ఇది లేఖ సారాంశం.
నేను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL:వైజాగ్ స్టీల్ )ను రక్షించేందుకు మీరు జోక్యం చేసుకోవాలని గతంలో ఒక విజ్ఞప్తి చేశాను
మీకు కర్ణాటకలోని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ లతో ఉన్న అనుబంధం, పబ్లిక్ సెక్టర్ సంస్థలను బలోపేతం చేయాలన్న మీ సంకల్పం దృష్ట్యా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశించాను. 2025 ఫిబ్రవరి 11న నేను ఈ విషయం మీద ఒక లేఖ కూడా రాశాను.
వైజాగ్ స్టీల్ పునరుజ్జీవన పేరుతో కేంద్రం ప్రకటించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అసలు అవసరానికి ఏ మాత్రం చాలవు. వైజాగ్ స్టీల్ బాకీలను పరిశీలిస్తే రుణాలు తీర్చడానికి కనీసం రూ. 30,000 కోట్ల అవసరం ఉంది. అంతేకాదు, దీర్ఘకాలికంగా పోటీలకు తట్టుకునే ధరకు స్టీల్ ఉత్పత్తి చేయాలంటే వైజాగ్ స్టీల్ కు తగిన సొంత ఇనుప ఖనిజ గనులు(captive iron ore mine) కావాలి. కాబట్టి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలిక పరిష్కారం కాదు.
వైజాగ్ స్టీల్ కు గనులను కేటాయించడంలో కేంద్రం వెనకడుగు వేయడం, దానికి విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు అనేక గనులు కేటాయించడాన్ని చూస్తే, ఈ ప్రభుత్వం ప్రయివేటు వారికి సన్నిహితంగా ఉందని, వైజాగ్ స్టీల్ ను తక్కువ ధరకే తనకిష్టమయిన ప్రయివేటు సంస్థకు విక్రయించాలనే రహస్య అజెండాను తయారుచేసుకుందని అర్థమవుతుంది.
వైజాగ్ స్టీల్ కి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేసి, సంస్థని రుణరహితంగా మార్చి, దానిని SAIL లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మేం చేసినా, కేంద్రం దానిపై దృష్టి పెట్టలేదు. NDA ప్రభుత్వం CPSE (Central Public Sector Enterprises) ల సామాజిక పాత్రకు ప్రాముఖ్యమీయడం లేదని, వైజాగ్ స్టీల్ ను తక్కువ ధరకే ప్రైవేట్ కంపెనీకి అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని వీటి వల్ల అర్థమవుతుంది.
ఈ ప్రాంత ప్రజలకు వైజాగ్ స్టీల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కలిగించే ఉపాధి అవకాశాలపై స్పష్టంగా అవగాహన ఉంది. SC, ST, BC వంటి వర్గాలకు ఉపాధికల్పించే విషయంలో పబ్లిక్ రంగ సంస్థలు ఎంతో సామాజిక ప్రయోజనంతో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత, ప్రస్తుత ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ కి పోటీగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రంలోని NDA ప్రభుత్వంతో చేతులు కలిపాయి. ఉదాహరణకు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSRCP) ప్రభుత్వమైతే వైజాగ్ స్టీల్ కి సహాయం చేయకుండా, కడపలో జిందాల్ (JSW) గ్రూప్ ప్లాంట్‌కు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ కి సమీపంలో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ప్లాంట్ కోసం మిట్టల్ గ్రూప్‌ను ఆహ్వానించడమే ఇందుకు మరో ఉదాహరణ.
ఇంతటితో ఆగకుండా, కేంద్ర ప్రభుత్వం మిట్టల్ కు ఐరన్ ఓర్ గనిని కేటాయించింది. మరి అతిముఖ్యమయిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ కి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు? అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల మాలిన ప్రేమ చూపుతూ నక్కపల్లి సమీపంలో DL పురంలో ఒక సొంత ఓడరేవును నిర్మించుకునేందుకు 2.9 కి.మీ. వాటర్‌ఫ్రంట్‌ను మిట్టల్ కు కేటాయించింది. ఇలాంటి ప్రేమ వైజాగ్ స్టీల్ మీద ఎందుకు లేదు. వైజాగ్ స్టీల్ బతికి బట్టకట్టేందుకు ఇలాంటి వసతులు ఎందుకు కల్పించలేదు.
దేశవ్యాప్తంగా పోర్టుల కోసం కేంద్రం ప్రభుత్వం ఒక విధానం తెచ్చింది. అలాగే AP ప్రభుత్వం AP Maritime Policy తెచ్చింది. వీటి ప్రకారం ఎవరికైనా ఒక పోర్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే, పారదర్శకమయిన బిడ్డింగ్ ద్వారా ప్రమోటర్ ను ఎంపిక చేయాలి. కాని , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా Ar మిట్టల్ కు అన్నింటిని పళ్లెంలో పెట్టి అందిస్తూ ఉంది.
డిఎల్ పురం వద్ద 2.9 కి.మీ వాటర్‌ఫ్రంట్ (Waterfront) రాష్ట్ర ప్రజల సహజ వనరులలో ఒకటి. జనం తరఫున వాటిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతలు. అటువంటి వనరులను నామమాత్ర ధరకు ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ప్రజల విశ్వాసానికి వ్యతిరేకం. ఇపుడు మిట్టల్ అనుకూలంగా తీసుకుంటున్న చర్యలు చట్టబద్ధం కాదు. సరైనవి కాదు.
ఈ చర్యల వలన తీరప్రాంతాలలో జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు (వడపాలెం, బంగరయ్యపేట, పెంటకోట, అమలాపురం, బోయినపాడు, రాజిపేట, దొండవాక, పెద్ద/చిన్న తీనర్ల, రేవుపోలవరం, బంగారంపాలెం) నష్టపోతాయి. పోర్ట్ కార్యకలాపాల వలన సముద్రజల కాలుష్యం పెరగడంతో చేపల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. చేపల నాణ్యత కూడా తగ్గుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై శ్రద్ధ లేదు. వారి దృష్టి మిట్టల్ కు ఎలా ప్రయోజనం చేకూర్చాలనే దాని మీద మాత్రమే ఉంది.
మిట్టల్ పోర్ట్ వల్ల విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT)కు కూడా ముప్పు ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో తూర్పు తీరంలో ఉన్న ఒక ప్రధాన పోర్ట్. ఆంధ్ర ప్రభుత్వ చర్యలు వైజాగ్ స్టీల్ తో పాటు VPT ఉనికికే ముప్పుగా మారుతున్నాయి. కేంద్రం, రాష్ట్రం రెండూ ఈ రెండు ప్రభుత్వ రంగల సామాజిక పాత్రను పట్టించుకోకపోవడం విచారకరం.
ఈ చర్యలు ఉత్తర ఆంధ్ర ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నాయి.
విశాఖ తీరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ప్రాముఖ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందా? ఎర్సెలార్ మిట్టల్ అనే విదేశీ కంపెనీకి పోర్ట్ అనుమతించే ముందు రక్షణ మంత్రిత్వశాఖను సంప్రదించిందా?
ఈ అంశాలపై నా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాను. మీరు, కేంద్రంలోని ఇతర మంత్రిత్వశాఖలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వైజాగ్ స్టీల్ మరియు VPTను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేయాలని కోరుతున్నాను. వీటిని విస్మరిస్తే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసిన వారు అవుతారని నేను మీకు గుర్తు చేస్తున్నాను.