ఖండాంతరాలకు అరకు కాఫీ!

అరకు ఆర్గానిక్‌ కాఫీని బ్రాండ్‌ చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడానికి టాటా కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.;

Update: 2025-08-16 05:51 GMT

అరకు కాఫీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆర్గానిక్‌ కాఫీని బ్రాండ్‌ చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడానికి టాటా కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత కాఫీ కంపెనీ స్టార్‌బక్స్‌ మెనూలో అరకు కాఫీని కూడా చేర్చేలా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.


అరకు కాఫీ ప్యాకెట్టు

ఆ టేస్టే వేరు..
మార్కెట్లో ఎన్ని కాఫీలున్నా.. అరకు కాఫీకున్న టేస్టే వేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండుతున్న ఈ కాఫీ పంటకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ పండే కాఫీ ఇతర కాఫీలకన్నా విభిన్న రుచిని కలిగి ఉంటుంది. అందువల్లే అరకు కాఫీకి అంతటి గిరాకీ. అలాంటి అరకు కాఫీ ఇప్పుడు విదేశీయులకూ తన రుచిని చూపించనుంది. ఇందుకోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందా(ఎంవోయూ)లను కుదుర్చుకుంది. దీంతో త్వరలోనే ఇంటర్నేషనల్‌ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఫలితంగా అరకు కాఫీ ప్రపంచ గుర్తింపు పొందడానికి మార్గం సుగమమైంది.

జీసీసీ ఎండీ కల్పనా కుమారి

ఆర్గానిక్‌ కాఫీ సాగుకు ప్రోత్సాహం..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మొత్తం పదకొండు మండలాల్లోనూ కాఫీ పంట సాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వీటిని అక్కడ గిరిజన రైతులు సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటి ద్వారా ఏటా 18 వేల టన్నుల కాఫీ గింజల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల ఆర్గానిక్‌ (సేంద్రియ) కాఫీకి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన రైతులను దీనివైపు మళ్లించేందుకు జీసీసీ అధికారులు కృషి చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం చింతపల్లి మండలంలో 884.55 హెక్టార్లు, జీకేవీధి మండలంలో 1,374 హెక్టార్లలోనూ 2,600 మంది గిరి రైతులు సేంద్రియ కాఫీని పండిస్తున్నారు. సేంద్రియ కాఫీ సాగులో ఎలాంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడరు. ఇలా మూడేళ్లు వీటిని వాడలేదని నిర్థారించుకున్నాక నాలుగో ఏడాది ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇస్తారు. దీనిని అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రాడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అపెడా) ద్వారా ముంబైకి చెందిన ఫుడ్‌ సెట్‌ సంస్థ జారీ చేస్తుంది. 2024–25 సంవత్సరానికి కిలో ఆర్గానిక్‌ కాఫీ గింజలను రూ.330, నాన్‌ ఆర్గానిక్‌ రూ.250 చొప్పున జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్‌ కాఫీకి పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో అరకు ఆర్గానిక్‌ కాఫీ పంటను విస్తృతం చేయాలని జీసీసీ నిర్ణయించింది. ఇప్పుడు పండిస్తున్న సేంద్రియ కాఫీకి అదనంగా వచ్చే నాలుగేళ్లలో మరో ఆరు వేల హెక్టార్లలో సాగును పెంచేలా సన్నాహాలు చేస్తోంది.

టాటా సంస్థ ఎంవోయూతో సీఎం చంద్రబాబు

‘టాటా’తో ఆర్గానిక్‌ కాఫీ ఎంవోయూ..
అల్లూరి జిల్లాలో పండే అరకు కాఫీకి ఇప్పటికే మంచి డిమాండ్‌ ఉంది. అక్కడ సాగయ్యే ఆర్గానిక్‌ కాఫీకి మరింత గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా కన్సూ్యమర్స్‌ సంస్థతో జీసీసీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఏడాది పది టన్నుల సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ (అరబికా చెర్రీ క్లీన్‌ కాఫీ)ని సరఫరా చేయనుంది. కిలో ఆర్గానిక్‌ కాఫీ గింజలను (పూర్తిగా ప్రాసెస్‌ చేసినవి) టాటా సంస్థ రూ.900 చొప్పున రైతులకు చెల్లిస్తుంది. మున్ముందు జీసీసీ టాటా కన్సూ్యమర్స్‌కు మరింతగా సరఫరాను పెంచనుంది. టాటా సంస్థ కొనుగోలు చేసిన అరకు ఆర్గానిక్‌ కాఫీకి దేశ, విదేశాల్లో బ్రాండింగ్‌ చేస్తుంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మన అరకు కాఫీ పేరు విశ్వవ్యాపితమవుతుంది.
‘స్టార్‌బక్స్‌’ మెనూలో అరకు కాఫీ..
హాథీ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ అనే మరో సంస్థతోనూ జీసీసీ ఎంఓయూ చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అరకు కాఫీని అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టార్‌బక్స్‌ కంపెనీ మెనూలోనూ చేర్చనుంది. స్టార్‌బక్స్‌ సంస్థ కాఫీ విక్రయాలు జరిపే చోట ఈ అరకు కాఫీ కూడా ఉంటుందన్న మాట! హాథీ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ గిరిజన ఉత్పత్తులతో పాటు అరకు కాఫీని కూడా అమెరికా మార్కెట్‌తో పాటు ఇతర దేశాలు, మన దేశంలోని వివిధ షోరూమ్‌ల్లోనూ అందుబాటులో ఉంచనుంది. అరకు కాఫీ పేరిట కియోస్కులను కూడా ఏర్పాటు చేస్తుంది.
అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపుః సీఎం
‘అరకు కాఫీ ప్రపంచ గుర్తింపు పొందాలి. మేం దేశంలోను, అంతర్జాతీయంగానూ గిరిజన, అటవీ ఆధారిత ఉత్పత్తులను, అరకు కాఫీని మార్కెటింగ్‌ చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో ప్రభుత్వం చేతులు కలిపింది. దేశమంతటా అరకు కాఫీ కియోస్కులను కలిగి ఉన్న రిటైల్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తాం’ అని ఇటీవల ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు చెప్పారు.
టాటాకు పది టన్నుల ఆర్గానిక్‌ కాఫీ..
‘అరకు కాఫీ రుచి ఇతర కాఫీలకు భిన్నంగా ఉంటుంది. అందుకే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అరకు కాఫీ అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్తుండడం చాలా సంతోషం.. టాటా కన్సూ్యమర్స్, హాథీ సర్వీసెస్‌ వంటి సంస్థలతో ఇటీవలే ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఇవి వెంటనే అమలులోకి వస్తాయి. టాటా కన్సూ్యమర్స్‌కు తొలుత పది టన్నుల ఆర్గానిక్‌ కాఫీని సరఫరా చేస్తాం. ఆ తర్వాత దశల వారీగా పెంచుతాం. అరకు ఆర్గానిక్‌ కాఫీని జీసీసీని మరింత బలోపేతం చేస్తాం. గిరిజన రైతులకు లాభం రావాలి. వారి జీవన స్థితిగతులు మెరుగు పడాలన్నదే జీసీసీ లక్ష్యం’ అని జీసీసీ ఎండీ కల్పనాకుమారి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Tags:    

Similar News