ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి అక్టోబర్ 10వరకు రిమాండు
హైదరాబాద్‌లో వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జగన్ గవర్నమెంట్‌లో పని చేసిన అధికారులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నానికి దూకుడు పెంచింది. అందులో భాగంగా జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట కార్పొరేషన్(ఏపీఎండీసీ)కు మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా వ్యవహరించిన వెంకటరెడ్డి మీద పూర్తి స్థాయి దృష్టి సారించింది. గత ఐదేళ్లల్లో మైనింగ్ వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని నిగ్గు తేల్చాని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా నాడు ఏపీఎండిసీకి ఎండీగా వ్యవహరించిన వెంకటరెడ్డిపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ వెళ్లి అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు ఆయను అరెస్టు చేయడంతో పాటు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకు రిమాండు విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. మరో వైపు వెంకటరెడ్డిని కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.