అవినీతి ఆరోపణలపై హోం మంత్రి అనిత పీఏ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత సహాయకుడిగా (PA) పనిచేస్తున్న జగదీష్‌ను తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు.;
By : The Federal
Update: 2025-01-04 03:57 GMT
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత సహాయకుడిగా (PA) పనిచేస్తున్న జగదీష్‌ను తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్‌లు, సిఫారసుల కోసం లంచాలు కోరడంతో పాటు సెటిల్మెంట్‌లలో పాల్గొన్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. జగదీష్ పదేళ్లుగా అనితకు PAగా సేవలు అందిస్తున్నారు.
NDA సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన అధికార దుర్వినియోగం మరింత పెరిగిందని సమాచారం. మంత్రి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తలే ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి శృతిమించి చివరకు ఆయన తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
సందు జగదీష్ వచ్చిన సందర్శకులపై పెత్తనాన్ని చెలాయించడం, జులుం ప్రదర్శించడం వంటివి చేసేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీనియర్ నేతలను కూడా పట్టించుకోకుండా, పూర్తిగా మంత్రిత్వ వ్యవహారాలపై తనకు అధికారం ఉన్నట్లుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. మద్యం లైసెన్స్ దారులపై ఒత్తిడి తెచ్చి రిటైల్ దుకాణాల్లో వాటా కోరడం, తిరుమల ఆలయ దర్శనాలకు సిఫారసు పత్రాలను తిరుపతిలో హోటల్ యజమానులకు అమ్మడం వంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదులు పెరుగుతుండటంతో హోం మంత్రి అనిత చివరికి జగదీష్‌ను తన పదవి నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగదీష్ తొలగింపుపై పాయకరావుపేట నియోజకవర్గంలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జగదీష్ కారణంగా తమకు నష్టపరిచినట్లు వారు ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని జగదీష్‌పై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ శ్రేణులు, అనితను వివిధ పనులపై కలవటానికి వచ్చిన వారు తొలి నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత పదేళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడినైనా ఖాతరు చేసేవారు కాదని ఫిర్యాదులు వచ్చాయి.
మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత.. జగదీష్‌ను పీఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకోవడం గమనార్హం.
జగదీష్ లెక్కలేనితనం, అరాచకాల్ని సహించలేకపోయిన ఎస్.రాయవరం మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు కొందరు నేరుగా మంత్రి అనితను కలిసి ఫిర్యాదు చేశారు. చివరకు వాళ్లను కూడా జగదీష్ బెదిరించినట్టు వార్తలు వచ్చాయి.
ఎస్.రాయవరం మండలంలోని రెండుచోట్ల, పాయకరావుపేట మండలంలో పాల్విన్‌పేటల్లో కొన్ని రోజులపాటు పేకాట శిబిరాలు నడిపారన్న ఆరోపణలు కూడా జగదీష్ పై ఉన్నాయి.
మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్సుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్‌పై ఆరోపణలు ఉన్నాయి.
హోం మంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌కు అమ్మేశారని ఆరోపణలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఆయన్ను హోం మంత్రి అనిత తొలగించారు.