పొలిటికల్ గవర్నెన్స్ తో ఏపీని సర్వనాశనం చేస్తున్నారు
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పొలిటికల్ గవర్నెన్స్ తో ఏపీని సర్వనాశనం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతంగా నడుస్తోందని, దీని వెనుక టీడీపీ నాయకులే ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ తమ తప్పులను ఇతరులపై నెట్టే అలవాటు ఉన్నవారని, నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఖండించారు. గురువారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు.
గ్రామీణ పాలన కుప్పకూలింది
సీఎం చంద్రబాబు గ్రామస్థాయి పాలనను గాలికొదిలేశారని, గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. "పొలిటికల్ గవర్నెన్స్ వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రైతులకు డీఏపీ, యూరియా దొరకడం లేదు, బీమా సంగతి పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల పంట నష్టం జరిగినా క్షేత్రస్థాయిలో అంచనా వేయలేదు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేవు. ఉల్లి, అరటి, టమాట, పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పత్తి ధర క్వింటాల్‌కు గతంలో రూ.12,000 ఉండగా, ఇప్పుడు రూ.5,000 కూడా లేదు. టమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు అన్యాయం
సీఎం చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. "ఎన్నికల సమయంలో మెరుగైన పీఆర్‌సీ, జీతాల పెంపు హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఐఆర్ గురించి మాట్లాడడం లేదు. జీపీఎస్, ఓపీఎస్ లేవు. రూ.31,000 కోట్ల బకాయిలు పెట్టారు. ప్రతి నెల ఒక్కటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి, ఒక్క నెల మాత్రమే ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు, పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. మా హయాంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఐఆర్, 11 డీఏలు ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వారి గురించి ఆలోచించాం" అని అన్నారు. "నాలుగు డీఏలు బకాయి ఉన్నాయి. ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కాక ఒక డీఏ ఇస్తామని డ్రామా చేశారు. నవంబర్‌లో ఇస్తామని చెప్పి, ఇంకా ఇవ్వలేదు" అని విమర్శించారు.
విశాఖ డాటా సెంటర్.. వైఎస్సార్‌సీపీ ఘనత
విశాఖలో గూగుల్ డాటా సెంటర్‌ను తమ హయాంలోనే ప్రారంభించామని, దీని ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని జగన్ స్పష్టం చేశారు. "2020లో కరోనా సమయంలో అదానీతో డాటా సెంటర్ ఒప్పందం కోసం బీజం వేశాం. 2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాం. 2023 మే 3న విశాఖలో శంకుస్థాపన చేశాం. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగింది. వైఎస్సార్‌సీపీ, అదానీ, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషితో ఈ ప్రాజెక్టు రూపొందింది. అదానీ రూ.87,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డాటా సెంటర్‌ను నిర్మిస్తోంది. కానీ, చంద్రబాబు దీని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు" అని ఆరోపించారు. "హైదరాబాద్ హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ ఆరు ఎకరాల్లో పునాది వేశారు. కానీ, చంద్రబాబు దాని ఘనత తనదిగా చెప్పుకుంటారు. 2003-04లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి మొదలైంది" అని వివరించారు.
నకిలీ మద్యం మాఫియా
"ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతంగా నడుస్తోంది. చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. టీడీపీ నాయకులే దీని వెనుక ఉన్నారు. ఏలూరులో టీడీపీ నేత ఆధ్వర్యంలో, రేపల్లెలో పేకాట కింగ్ నడుపుతున్న ఈ దందా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల ద్వారా కొనసాగుతోంది. ఒక మొలకల చెరువులోనే 20,000 లీటర్ల నకిలీ మద్యం బయటపడింది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారు" అని జగన్ ఆరోపించారు. "మా హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. బెల్ట్ షాపులు రద్దు చేసి, షాపుల సంఖ్య తగ్గించి, క్యూఆర్ కోడ్ విధానం తెచ్చాం. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్‌ను డైవర్షన్‌గా ఉపయోగిస్తున్నారు. సీబీఐ విచారణ జరిపితే నిజాలు బయటపడతాయి. అందుకే చంద్రబాబు సిట్‌తో దొంగ ఆట ఆడుతున్నారు" అని విమర్శించారు.
జనార్దన్ రావు, జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు
నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు, జోగి రమేష్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు. "జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ స్పష్టం చేశారు. ఫోన్‌లు తనిఖీ చేసుకోమని సవాల్ విసిరారు. సీబీఐ ఎంక్వైరీ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయినా టీడీపీ టికెట్‌పై ఎలా పోటీ చేశారు? పరవాడలో నకిలీ మద్యం బయటపడినా తనిఖీలు జరపలేదు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని సవాల్ విసిరారు.
విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీలో వైఫల్యం
"స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, గోరుముద్ద పథకం, విద్యాదీవెన, వసతి దీవెన నిర్వీర్యమయ్యాయి. ఆరోగ్యశ్రీ కుప్పకూలింది. పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆసుపత్రులు ధర్నాలు చేస్తున్నాయి. 104, 108 సర్వీసులను రూ.5 కోట్ల టర్నోవర్ లేని వ్యక్తులకు అప్పగించారు. మా హయాంలో మెడికల్ కాలేజీలు తెచ్చాము. కానీ, ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణకు అప్పగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాలు సేకరిస్తున్నాం" అని జగన్ తెలిపారు.
ప్రజల దృష్టి మరల్చే కుట్ర
"సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తప్పుడు ఆధారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విజయవాడ సీపీ చంద్రబాబుకు, లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతున్నారు. అన్నమయ్య, ఎన్టీఆర్, అనకాపల్లి, పాలకొల్లు, నెల్లూరులో నకిలీ మద్యం బయటపడింది. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోంది. ఆక్షన్ల ద్వారా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు నడుపుతున్నారు" అని జగన్ ఆరోపించారు.