మన్యం వీరుడికి మరో మణిహారం!

భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు. ఇప్పటికే ఆయన పేరిట అల్లూరి జిల్లా ఏర్పాటు. సీతారామరాజు పోరాటానికి ఆంధ్ర ప్రభుత్వాల సముచిత స్థానం.

By :  Admin
Update: 2024-09-20 09:40 GMT

 (బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరికి విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోను, మన్యంలోని గిరిజనులతోనూ విడదీయరాని బంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో గిరి పుత్రుల కోసం పోరాడి అశువులు బాసిన మన్యం వీరుడికి మరో మణిహారం దక్కింది. ఈ విప్లవ వీరుడి పేరిట ఇప్పటికే ఒక జిల్లా ఏర్పాటైంది. తాజాగా ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు ఖరారైంది. ఇలా ఆ పోరాట యోధుడికి ఎప్పటికప్పుడే రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో 2022 ఏప్రిల్ 4న పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో విప్లవ వీరుడు అల్లూరికి సరైన ప్రాధాన్యతతో

నివాళులర్పించినట్టయింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అల్లూరి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గతం (1996)లోనే అల్లూరి పేరిట తపాలా శాఖ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇంకా ఏలూరులోని క్రికెట్ స్టేడియానికి ఆయన పేరే పెట్టారు. 2017 అక్టోబర్ 9న పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం, వి. విజయసాయిరెడ్డిల అభ్యర్థనతో పార్లమెంట్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్ర హం ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రస్తుత అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి మెమోరియల్ థీమ్ పార్కును ఏర్పాటు చేశారు. విశాఖ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాలను నెలకొల్పారు. అల్లూరి పుట్టినరోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకుటోంది.

పోరుబాటలోకి ఇలా..

1882 మద్రాసు అటవీ చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిషర్లను వ్యతిరేకించాడు అల్లూరి. ఈ చట్టం ఆదివాసీల స్వేచ్ఛను హరించివేయడమే కాదు..వారి సంప్రదాయ పోడు వ్యవసాయానికి అడ్డుకట్ట వేసింది. దీంతో వారి జీవన విధానానికే ముప్పు వాటిల్లింది. గిరిజనుల మనోవేదనను గుర్తించి వారి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని, వారి హక్కుల గురించి అవగాహన కల్పించి వారిని సంఘటిత పరిచాడు. బ్రిటిషర్ల అణచివేతపై పోరాటానికి సిద్దం చేశాడు. సాయుధ పోరాటంపై అవగాహన కోసం చిట్టగాంగ్ వెళ్లి కొంతమంది విప్లవకారులను కలిశాడు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం గెరిల్లా యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. బ్రిటిష్ పాలకులకు సహాయ నిరాకరణ ఉద్యమం, రంప తిరుగుబాటుల్లో అల్లూరి కీలక పాత్ర పోషించారు. ఆదివాసీలు, ఇతర

 

సానుభూతిపరులతో సాయుధ దళాలను సమీకరించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గెరిల్లా పోరాటాలు సాగించాడు. 1922లో మన్యం/రంప తిరుగుబాటు నాయకుడిగా, అల్లూరి బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా తన దళాలతో తూర్పు కనుమల ప్రాంతం నుంచి బహిష్కరించే లక్ష్యంతో నడిపించాడు. తన దళాల కోసం తుపాకులు సంపాదించడానికి అన్నవరం, అడ్డతీగల, చింతపల్లి, కృష్ణదేవిపేట (కేడీ పేట), రంపచోడవరం, రాజవొమ్మంగి, నర్సీపట్నం వంటి పలు పోలీస్ స్టేషన్లపై తమ దళాలతో దాడులకు తెగబడి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. అగ్గి పిడుగు, మన్యం వీరుడుగా అల్లూరిని సంభోదించేవారు. స్వాతంత్ర్య సమరయోధుడే కాదు.. ధైర్యం, త్యాగం కలగలిసిన వ్యక్తి అల్లూరి. తమకు కంటిమీద కునుకులేకుండా చేసిన అల్లూరిని ఎలాగైనా పట్టుకోవాలని నాటి బ్రిటిషర్లు తంటాలు పడ్డారు. రెండేళ్ల సుదీర్ఘ వేట అనంతరం చింతపల్లి అడవుల్లో బంధించారు. అనంతరం 1924 మే 7న అప్పటి విశాఖ జిల్లా కొయ్యూరు అడవిలో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.

అల్లూరి గురించి..

1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారాయన. అనంతరం మేనమామ రామచంద్రరాజు అల్లూరి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురానికి తీసుకెళ్లిపోయారు. కాకినాడలో హైస్కూలు చేరాక తన తల్లి స్వస్థలమైన విశాఖపట్నం వెళ్లి అక్కడ ఏవీఎన్ కళాశాలలో ఉన్నత విద్య కోసం చేరాడు. అక్కడ నుంచే గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ పోరాటాలు చేస్తూ గిరిజనులకు చేరువయ్యాడు. ఆ సమయంలో తన స్నేహితుని సోదరి సీతను ప్రేమించాడు. అయితే ఆమె చిన్న వయసులోనే మరణించడంతో రామరాజు తట్టుకోలేకపోయాడు. ఆమె జ్ఞాపకంగా రామరాజుకు ముందు సీతను చేర్చుకుని సీతారామరాజుగా ప్రసిద్ధి చెందాడు. స్వాతంత్య్ర ఉద్యమ బాటలో ఉన్న ఆయన తన చదువకు స్వస్తి చెప్పాడు. అయినప్పటికీ ప్రైవేటుగా తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్ భాషల సాహిత్యంపై పట్టు సాధించాడు. 

Tags:    

Similar News