ముస్తాబవుతున్న అసెంబ్లీ.. నేతలకు బాబు పిలుపు

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముస్తాబవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Update: 2024-07-21 07:52 GMT

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముస్తాబవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లోనే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జగన్.. ఈ సమావేశాలకు హాజరవుతారా అవ్వరా అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అసెంబ్లీ ముస్తాబవుతోంది. వాడివేడిగా సాగే చర్చలకు నేతలు కూడా సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యర్థుల ఘాటైన ప్రశ్నలను ఎదుర్కోవడానికి అధికార పక్షం నాయకులు, అదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కూటమి నేతలు రెడీ అవుతున్నారు.

కూటమి సర్కార్ ఆధ్వర్యంలో జరగనున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెల ఆఖరుతో తీరనుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న సమావేశాల్లో ఈ ఓటాన్ బడ్జెట్‌ను మరో మూడు నెలలపాటు పొడిగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ నెలలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వాటిలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు 23న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూటమి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

నేతలకు చంద్రబాబు ప్రత్యేక పిలుపు

అసెంబ్లీ సమావేశాలకు ఇంకా రెండు రోజులే సమయం ఉన్న క్రమంలో పార్టీ నేతలకు చంద్రబాబు ప్రత్యేక పిలుపునిచ్చారు. నేతలంతా కూడా అసెంబ్లీకి వెళ్లేముందు సోమవారం ఉదయం 8:30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అసెంబ్లీకి బయలుదెరాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ పసుపు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని టీడీఎస్పీ సూచించింది. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియపరచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ప్రయత్నిస్తోంది. వీటిలో భాగంగానే చంద్రబాబు ఇప్పటికే దాదాపు 5 శ్వేతపత్రాలు విడుదల చేశారు. వీటిపై మరోసారి అసెంబ్లీలో చర్చలు జరగొచ్చని సమాచారం.

Tags:    

Similar News