ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం
పశ్చిమ గోదావరి జిల్లాలో పది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామంటున్నారని మాజీ మంత్రి కారుమూరి మండిపడ్డారు.;
By : The Federal
Update: 2025-05-10 12:05 GMT
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులకు గోనె సంచులను కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తే కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు.
రైతుల నుంచి ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాల్సిందేనని కారుమూరి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కొనుగోలు చేయలేని పక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన పోరాటానికి దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంత చేస్తాం.. ఇంత చేస్తాం అని కూటమి ప్రభుత్వం ప్రగల్బాలు పలికిందని, తీరా చూస్తే రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో కొనుగోలు శక్తి కూడా పడిపోయిందని కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.