రాజుకుంటున్న గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూముల వివాదం

తాము వెంకటేశ్వరస్వామి భక్తులమని, ఎలాంటి తప్పులు చేయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.;

Update: 2025-09-14 10:09 GMT

కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ భూములకు సంబంధించిన లీజు వ్యవహారం అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీల మద్య విమర్శలకు, ప్రతి విమర్శలకు దారితీసింది. దేవాలయం భూములను తాము కాజేస్తున్నట్లు కావాలనే వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోంటే.. టీడీపీ నేతలు దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే గొడుగుపేట దేవాలయం భూములపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు టీడీపీ నాయకుల కన్నుపడిందని, అక్రమ మార్గంలో సీఎం చంద్రబాబు ఈ భూములను వారికి కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు ఇది వరకే ఆరోపణలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ నానీలు స్పందించారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ.. గొల్లపూడి నేషనల్‌ హైవే పక్కనే ఉన్న 40 ఎకరాల దేవస్థానం భూములను విజయవాడ ఉత్సవ కమిటీ రూ. 5 కోట్లతో డెవలప్‌ చేస్తోందని పేర్కొన్నారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం చరిత్రలో లేని విధంగా ఈ సారి రికార్డు సాయిలో ఆదాయాన్ని సమకూర్చిందన్నారు. గొడుగుపేట దేవాలయం భూములు ఎవ్వరికీ కూడా బదలాయింపులు జరగడం లేదన్నారు. విజయవాడ ఉత్సవ్‌ కమిటీ ఈ భూములను 56 రోజులకు లీజుకు తీసుకుందని, దీని ద్వారా రూ. 45 లక్షల ఆదాయం దేవాలయానికి సమకూరిందన్నారు. మనసులా బీచ్‌ ఫెస్టివల్‌ స్పూర్తితో విజయవాడ ఉత్సవ్‌ను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గొడుగుపేట దేవాలయం భూములను 56 రోజులకు లీజుకు తీసుకున్నామని, ఆ లీజు రూ. 45లక్షలను స్వామివారి సన్నిధిలో ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. తాము వెంకటేశ్వరస్వామి భక్తులమని, ఎలాంటి తప్పులు చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సంరం వేసవిలో మసులా బీచ్‌ ఫెస్టివల్, దసరాకి విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించి తీరుతామన్నారు.
Tags:    

Similar News