అమ్మయ్యా.. చంద్రబాబు తేల్చేశారు! లోకేశ్ ఇక అక్కడే!!
తమ్ముళ్లూ, ఇక ఊరుకోండి, జనసైనికులూ, కాస్త ఆగండి! చంద్రబాబు ఏమి చెప్పారో వినండి. అబ్బాయి దేనికి పనికి వస్తాడో కల్యాణ్ దేనికి పనికొస్తాడో చంద్రబాబు చెప్పేశారు.;
By : The Federal
Update: 2025-01-23 05:38 GMT
వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రగులుతున్న కేంద్రమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గొడవకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో తెర దించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి దీటుగా నారా లోకేశ్ ను కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలని కొందరు, అటువంటి పరిస్థితే వస్తే పవన్ కల్యాణేనే ముఖ్యమంత్రిని చేసి లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని మరికొందరు, చంద్రబాబు పెద్దమనసు చేసుకుని ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టాలని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా వాదనలు, ప్రెస్ కాన్ఫరెన్సులు, పోటాపోటీ ప్రకటనలతో రాష్ట్రంలో మరే సమస్యా లేనంతగా ఊదరగొట్టారు. సరిగ్గా ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ పెట్టుబడుల వేటలో భాగంగా దావోస్ సమ్మిట్ కి వెళ్లారు. అక్కడ కూడా చంద్రబాబుకు ఈ తలనొప్పి తప్పలేదు. పెట్టుబడులు తేవడానికి పోయిన ఓ మంత్రి టీజీ భరత్- ప్రభువును మించి ప్రభు భక్తి చూపడంతో చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు.. వచ్చిన పనేంటీ, నీ సంకీర్తన ఏంటని మందలించడం జరిగిపోయింది. అయినప్పటికీ, లోకేశ్ ప్రాపకాన్ని ఎలాగోలా సంపాయించాలన్న కుతూహలం ఉన్న తెలుగుదేశం తమ్ముళ్లు, అన్నలు- మావాడు మహా నాయకుడు, ఆయన సారథ్యంలోనే తెలుగుదేశం సభ్యత్వం కోటికి చేరిందీ, ఇక ఆయన్ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని తుడుందెబ్బ మోగించారు. ఈ గోల ఇంతటితో ఆపండని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పార్టీల నాయకులు మొత్తుకున్నా ఎవరూ వినకపోయారు.
సరిగ్గా ఈదశలో చంద్రబాబే దావోస్ లో మీడియా వాళ్లను పిలిచి తన మనసులో మాట చెప్పి ఈ సరికొత్త ఉపముఖ్యమంత్రి వివాదానికి తెర దించారు. తానెక్కడికీ పోనని, తన కుమారుడు లోకేశ్ వ్యాపారానికి సరైనోడని తేల్చేశారు. ఇంకా చాలా చెప్పినా అవేవీ హైలెట్ కాలేదు. ఇవి మాత్రమే పెద్దక్షరాల్లో మిగిలాయి.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..
"వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఇలా ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య" అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధినేతగా లోకేశ్ వారసత్వంపై మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు. నేనెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేశ్‌కు చాలా తేలికైన పని.. కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వమంటూ ఏమీ లేదు’ అన్నారు చంద్రబాబు. దావోస్ పర్యటనలో భాగంగా ‘ఇండియా టుడే’, ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.
మీరు కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ... కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగింది. ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోంది. ఇప్పుడు నా దృష్టి అంతా రాష్ట్రాభివృద్ధి పైన్నే.. అన్నారు. దీంతో చంద్రబాబు తానేమిటో చెప్పకనే చెప్పారు. తాను ఎక్కడికీ పోనని, సీఎం పోస్టులో తానే ఉంటానని, లోకేశ్ ఉప ముఖ్యమంత్రి కాబోరని, పవన్ కల్యాణ్ కి వచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చేశారు. ఏపీ పునర్నిర్మాణమే మా ధ్యేయం అన్నారు.
రాజకీయ కక్షసాధింపు ఉండదని చెప్పడం ద్వారా వైసీపీ అధినేత జగన్ కి కూడా ఏ ఢోకా ఉండదని చెప్పినట్టయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తాం. జగన్‌పై ఇప్పుడే కాదు, గతంలోనూ కేసులు ఉన్నాయని చంద్రబాబు గతంలో చెప్పిందే మళ్లీ చెప్పారు.
గుజరాత్‌లో ఐదుసార్లు వరుసగా బీజేపీ గెలిచిందని చెప్పడం ద్వారా తాము కూడా ఐదు సార్లు గెలుస్తామన్న భరోసా కల్పించారు టీడీపీ శ్రేణులకి. 2029లో కూడా నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నా. వారు వాస్తవాలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్‌రేట్‌తో ఎన్నడూలేని విజయం అందించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేం రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నాం అన్నారు చంద్రబాబు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలి. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణం.. అని చంద్రబాబు చెప్పారు.